గుంటూరు జిల్లాలో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 3.1 నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. విద్యార్థుల అభ్యసన పురోగతి, తల్లిదండ్రుల భాగస్వామ్యం, పాఠశాల అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మెగా పి.టి.ఎం నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ వివరాలు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,048 పాఠశాలల్లో 90,596 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. ఇందులో 807 ప్రాథమిక పాఠశాలల్లో 33,504 మంది విద్యార్థులు, 39 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 4,516 మంది విద్యార్థులు, 202 ఉన్నత పాఠశాలల్లో 52,576 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. అలాగే ఐదు ప్రభుత్వ కళాశాలల్లో 1,500 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు.
మెగా పేరెంట్-టీచర్ సమావేశంలో భాగంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, దాతలు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ఆహ్వానించి విద్యార్థుల చదువు, అభ్యసన స్థాయి, పురోగతి గురించి చర్చిస్తారని చెప్పారు.
గత 75 రోజులుగా అమలు చేస్తున్న హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, గ్యారంటీ ఫండమెంటల్ లెర్నింగ్ అండ్ న్యూమరసి కార్యక్రమాల ఫలితాలను తల్లిదండ్రులకు వివరించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలు, పిల్లల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యాస పురోగతిని తల్లిదండ్రులకు వివరించే కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. లీప్ యాప్ను ప్రతి తల్లిదండ్రి డౌన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ యాప్ ద్వారా తమ పిల్లల విద్యా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మెగా సమావేశంలో విద్యార్థుల భద్రత, మంచి స్పర్శ–చెడు స్పర్శ, సానుకూల తల్లిదండ్రుల పాత్ర వంటి అంశాలపై వీడియో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల విజయాలు, పదో తరగతి ఫలితాలు, ఆనందభరిత అభ్యాస కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఐఐటీ ప్రవేశాల వంటి అంశాలపై ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.
విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే విధంగా తరగతి గదుల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తయారు చేసిన వస్తువులు, బోధనా సామగ్రి, క్రీడా పరికరాలు, విద్యా కిట్లు, మదర్స్ యాక్టివిటీస్ ప్రదర్శనకు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలల ప్రత్యేక విజయాలను ఫొటో గ్యాలరీ రూపంలో ప్రదర్శించనున్నారు.
తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా పలు పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తల్లులకు ముగ్గుల పోటీ, నిమ్మకాయ–చెంచా పోటీ, మ్యూజికల్ చెయర్స్ వంటి కార్యక్రమాలు, తండ్రులకు తాడు లాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగే ఈ సమావేశంలో ప్రార్థన, ప్రధానోపాధ్యాయుల విద్యా సంవత్సర నివేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు, లీప్ యాప్ ప్రదర్శన, పాఠశాల నిర్వహణ కమిటీ ప్రసంగాలు, ముఖ్య అతిథుల ప్రసంగాలు, ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
కార్యక్రమం అనంతరం పాల్గొన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అతిథులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ప్రత్యేక మెనూతో భోజనం అందించనున్నట్లు తెలిపారు. అన్నం, ఆకుకూర పప్పు, ప్రత్యేక గుడ్డు కూర, కూరగాయల కూర, మిల్లెట్ చిక్కీ వంటి వంటకాలను అందించనున్నట్లు చెప్పారు.
తల్లిదండ్రులు తమ పిల్లల విద్యలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశాల ద్వారా పాఠశాలలు, తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య సమన్వయం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాషా పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news