కోర్టు ధిక్కరణ కేసు విచారణలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా హాజరుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు జారీ చేసిన నోటీసులు అందినప్పటికీ వ్యక్తిగతంగా హాజరుకాకపోవడం, హాజరు మినహాయింపు కూడా కోరకపోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. “కోర్టులకు మీరిచ్చే గౌరవం ఇదేనా?” అంటూ ప్రశ్నించిన హైకోర్టు, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించింది. కారుణ్య నియామకానికి సంబంధించిన 2023 ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో హైదరాబాద్కు చెందిన సయ్యద్ మహబూబ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి విచారణ చేపట్టారు. విచారణ సమయంలో యోగితా రాణా హాజరుకాకపోవడంతో మధ్యాహ్నంలోగా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం నిజామాబాద్లో ఉన్న ఆమె ఆన్లైన్ ద్వారా హాజరై సమాచార లోపం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇచ్చి బేషరతుగా క్షమాపణ కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చారు. అయితే న్యాయమూర్తి స్పందిస్తూ నోటీసు అందిన తర్వాత కనీసం న్యాయవాది అయినా హాజరు కావాల్సిందని వ్యాఖ్యానించారు. గత ఉత్తర్వుల అమలు గురించి ప్రశ్నించగా కలెక్టర్కు సూచనలు జారీ చేశామని యోగితా రాణా తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, అధికారులు పరస్పరం బాధ్యతలను ఒకరిపై మరొకరు నెట్టివేస్తూ పిటిషనర్ జీవితంతో ఆడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాల అమలుతో పాటు కోర్టు ధిక్కరణ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణకు యోగితా రాణాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు మంజూరు చేసింది.
Fetching videos...
Fetching latest news...
No trending news