భారతీయ రైల్వేలు సరుకు రవాణా రైళ్లను నిలిపివేయకుండానే వాటి బరువును కొలిచే ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కదులుతున్న రైళ్ల బరువును కొలిచే ఈ ప్రత్యేక వంతెనల ద్వారా సరుకు రైళ్లను నిలిపి బరువు తూచే అవసరం ఉండదు. దీంతో బరువు కొలిచేందుకు పట్టే సమయం తగ్గడంతో పాటు సరుకు రైళ్ల రాకపోకలు వేగవంతం కానున్నాయి. అధిక బరువు కారణంగా రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు రైల్వే పట్టాలపై అనవసరమైన భారాన్ని నియంత్రించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.
ఉత్తర మధ్య రైల్వే పరిధిలోని సర్సౌకి, సింగ్‌పూర్ దుమ్రా, కబ్రాయ్, గోహద్ రోడ్ స్టేషన్లలో ప్రస్తుతం ఈ ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైల్వే సరుకు రవాణా వ్యవస్థను ఆధునీకరించే చర్యల్లో భాగంగా ఈ సాంకేతికతను ప్రవేశపెట్టారు. కదులుతున్న సరుకు రైలులోని ప్రతి బోగీ బరువును రైలు ఆపకుండానే నమోదు చేయడం దీని ప్రత్యేకత. సాధారణంగా సరుకు రైళ్లను బరువు కొలిచేందుకు నిలిపివేయాల్సి రావడంతో అదనపు సమయం, నిర్వహణ ఏర్పాట్లు అవసరమయ్యేవి. కొత్త వ్యవస్థతో ఈ అనవసరమైన నిలుపుదల తగ్గి రైళ్ల రాకపోకల సామర్థ్యం మెరుగుపడనుంది.
ఈ వ్యవస్థ ద్వారా మొత్తం బోగీ బరువును మాత్రమే కాకుండా ప్రతి ఇరుసుపై పడుతున్న భారాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించవచ్చు. దీంతో బోగీలో సరుకు సమానంగా ఉందా, ఏదైనా ఇరుసుపై అధిక భారం పడుతోందా అనే విషయాలను అధికారులు వెంటనే గుర్తించగలరు. అసమానంగా లేదా నిర్ణీత పరిమితికి మించి సరుకు లోడ్ చేసిన సందర్భాల్లో ముందుగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అధిక బరువు, అసమతుల్య సరుకు లోడింగ్ వల్ల బోగీలు, రైల్వే పట్టాలు, ఇతర మౌలిక వసతులకు కలిగే ప్రమాదాలను తగ్గించడంలో ఇది కీలకంగా మారనుంది.
ఈ బరువు కొలిచే వ్యవస్థ గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్ల బోగీల బరువును కొలవగలదు. ప్రతి ఇరుసుపై 35 టన్నుల వరకు భారాన్ని గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఒక బోగీ లేదా కోచ్‌కు గరిష్ఠంగా 140 టన్నుల వరకు బరువును లెక్కించే విధంగా సాంకేతిక వ్యవస్థను రూపొందించారు. రైలు రెండు దిశల్లో ప్రయాణించినా బరువును నమోదు చేసే అవకాశం ఉంది. రైలు వేగం, ఇరుసులపై భారం, ప్రతి బోగీ మొత్తం బరువు వంటి వివరాలను సాంకేతిక వ్యవస్థ నమోదు చేస్తుంది.
రైల్వే బోర్డు 2019లోనే అన్ని జోనల్ రైల్వేలకు కదులుతున్న రైళ్ల బరువు కొలిచే వంతెనలను సరుకు రవాణా సమాచార వ్యవస్థతో అనుసంధానించాలని సూచించింది. దేశవ్యాప్తంగా 218 ప్రాంతాలను ఈ వ్యవస్థతో అనుసంధానించేందుకు ఏర్పాటు చేశారు. బరువు వివరాలను డిజిటల్‌గా నమోదు చేయడం ద్వారా మానవ జోక్యం తగ్గడంతో పాటు సరుకు లోడింగ్‌పై మరింత పారదర్శకత ఏర్పడుతుంది. నమోదు చేసిన వివరాలను ఆధారంగా చేసుకుని సరుకు రవాణా ప్రక్రియను మెరుగ్గా పర్యవేక్షించవచ్చు.
సరుకు రైళ్లను ప్రత్యేకంగా నిలిపివేయాల్సిన అవసరం తగ్గడం వల్ల రైల్వే మౌలిక వసతులను మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రైళ్ల రాకపోకల సమయం తగ్గడంతో బోగీల తిరుగుడు వేగం పెరిగి సరుకు రవాణా సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇప్పటికే ఉన్న రైల్వే నెట్వర్క్ ద్వారా మరింత ఎక్కువ సరుకును సమర్థంగా తరలించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ వ్యవస్థతో వ్యాపారులు, సరుకు రవాణా సంస్థలకు కూడా ప్రయోజనం కలగనుంది. సరుకు ఏ ఇరుసుపై ఎంత బరువు ఉందో తెలుసుకునే అవకాశం ఉండటంతో లోడింగ్‌లో లోపాలను ముందుగానే సరిదిద్దుకోవచ్చు. అధిక బరువు లేదా అసమాన లోడింగ్ కారణంగా విధించే జరిమానాలను తగ్గించుకోవచ్చు. దీంతో సరుకు రవాణా ఖర్చులు మరింత అంచనా వేయదగినవిగా మారడంతో పాటు వ్యాపారులకు సమయం, ఖర్చు, భద్రత పరంగా ప్రయోజనం కలుగుతుంది. మొత్తంగా రైల్వేల్లో వేగం, భద్రత, పారదర్శకత, సామర్థ్యాన్ని ఒకేసారి పెంచే సాంకేతిక పరిష్కారంగా ఈ కదిలే బరువు కొలిచే వ్యవస్థ నిలవనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news