రైలు ప్రయాణాల సమయంలో ఆహారం కోసం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను వినియోగించే ప్రయాణికులకు భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. రైల్వే శాఖ అనుమతి లేకుండా ప్రయాణికులకు ఆహార సేవలు అందిస్తున్న 14 అనధికార వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లపై కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యత, వ్యక్తిగత డేటా రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది.
ఇటీవలి కాలంలో రైలు ప్రయాణాల్లో ఫుడ్ డెలివరీ సేవలకు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రయాణికులు తమ పీఎన్ఆర్ నంబర్ ఆధారంగా ముందుగానే ఆహారం బుక్ చేసుకుంటే, తదుపరి స్టేషన్లో వారికి ఆర్డర్ చేసిన భోజనం అందే విధంగా అనేక ప్లాట్‌ఫారమ్‌లు సేవలు అందిస్తున్నాయి. ఈ సేవల విస్తరణతో పాటు అనధికారికంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు కూడా రంగంలోకి వచ్చాయి. రైల్వే శాఖ నుంచి ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా ప్రయాణికులకు ఆహారం సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన ఐఆర్సీటీసీ వాటిపై చర్యలకు దిగింది.
రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులకు ఆహార సేవలు అందించాలంటే సంబంధిత సంస్థలు అధికారిక అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే కొన్ని యాప్‌లు, వెబ్సైట్లు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ సేవలు అందిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సరఫరా అయ్యే ఆహారం నాణ్యతపై ఎలాంటి హామీ ఉండదని, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవచ్చని ఐఆర్సీటీసీ ఆందోళన వ్యక్తం చేసింది.
అంతేకాకుండా ఆన్లైన్ చెల్లింపుల సమయంలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, మొబైల్ నంబర్లు వంటి సున్నితమైన డేటా భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో చెల్లింపుల వివాదాలు, ఆర్డర్ సమస్యలు, నాణ్యత లేని ఆహారం వంటి ఫిర్యాదులు కూడా నమోదైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అనధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు ముందుగా లీగల్ నోటీసులు జారీ చేసిన ఐఆర్సీటీసీ, తాజాగా వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రయాణికులను తప్పుదోవ పట్టిస్తూ రైల్వే అధికారిక సేవల మాదిరిగా ప్రచారం చేసుకుంటున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు కొనసాగనున్నట్లు తెలిపింది.
చర్యలు ఎదుర్కొంటున్న ప్లాట్‌ఫారమ్‌లలో రైల్ రెస్ట్రో, ఈ క్యాటరింగ్, ఖానా ఆన్లైన్, ట్రైన్వే, రైల్ మీల్, ట్రైన్ మెనూ, ఫుడ్ ఆన్ ట్రాక్, ట్రావెలర్ ఫుడ్, రైల్ మిత్ర, ట్రావెల్ ఖానా, ట్రైన్స్ కేఫ్, డీఐబీ రైల్, రైడ్ ఫుడ్, కమ్స్ సమ్ వంటి యాప్‌లు, వెబ్సైట్లు ఉన్నట్లు సమాచారం.
ప్రయాణికులు కేవలం అధికారికంగా గుర్తింపు పొందిన ఐఆర్సీటీసీ, రైల్ వన్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మాత్రమే ఆహారం బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అధికారిక సేవల ద్వారా ఆర్డర్ చేస్తే ఆహార నాణ్యత, సురక్షిత చెల్లింపులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు హామీ ఉంటుందని తెలిపారు.
రైల్వే ప్రయాణికులు ఆకర్షణీయమైన ఆఫర్లు, తక్కువ ధరల పేరుతో అనధికార యాప్‌లను ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలని ఐఆర్సీటీసీ సూచించింది. భద్రత, నాణ్యత, విశ్వసనీయత కోసం అధికారిక ప్లాట్‌ఫారమ్‌లనే వినియోగించడం ఉత్తమమని పేర్కొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news