వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం హడావిడిలో పిల్లలను స్కూల్‌కు సిద్ధం చేసే క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు లంచ్ బాక్స్‌లో పోషకాహారానికి బదులుగా జంక్ ఫుడ్‌ను ఎక్కువగా పెడుతున్నారు. పిల్లలు ఇష్టపడతారనే కారణంతో చిప్స్, బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తరచూ పంపిస్తున్నారు. అయితే ఇది పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లల లంచ్ బాక్స్‌లపై నిర్వహించిన అధ్యయనంలో సుమారు 34 శాతం బాక్స్‌లలో ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆహారాల్లో అధికంగా చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉండటంతో పాటు అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా పిల్లల్లో ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. అంతేకాకుండా ఐరన్, ప్రోటీన్, ఒమేగా-3 వంటి కీలక పోషకాల లోపం వల్ల శారీరక ఎదుగుదల, మానసిక చురుకుదనం కూడా దెబ్బతింటోంది.
జంక్ ఫుడ్‌లో అధికంగా ఉపయోగించే శుద్ధి చేసిన పిండి పదార్థాలు జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ వంటి ఇబ్బందులు తరచుగా ఎదురవుతాయి. చాక్లెట్లు, కేకులు వంటి అధిక చక్కెర పదార్థాలు దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి తగ్గి చిన్నారులు తరచూ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
పిల్లల ఆహారంలో సమతుల్యత చాలా ముఖ్యం. లంచ్ బాక్స్‌లో ఇంట్లో తయారుచేసిన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా ఉండాలి. అన్నం, పప్పు, ఆకుకూరలు, గుడ్లు, చేపలు, చికెన్ వంటి పదార్థాలను చేర్చడం మంచిది. చిన్న పిల్లలు కూరగాయలు తినకపోతే వాటిని ఇడ్లీలు, దోసెలు, చపాతీల రూపంలో ఆకర్షణీయంగా తయారు చేసి ఇవ్వాలి.
పుదీనా రైస్, నిమ్మకాయ అన్నం, వెజిటబుల్ బిర్యానీ, చట్నీతో ఇడ్లీలు, ఉడికించిన గుడ్లు వంటి వంటకాలు లంచ్ బాక్స్‌కు మంచి ఎంపికలు. ప్యాకెట్ జ్యూస్‌లకు బదులుగా తాజా పండ్ల ముక్కలు ఇవ్వాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేరుశెనగలు, శనగలు, పాప్‌కార్న్, బెల్లం లడ్డూలు, ఖర్జూరాలు, అరటిపండ్లు వంటి ఆరోగ్యకరమైన చిరుతిండిని అలవాటు చేయాలి.
పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం కీలకం. తల్లిదండ్రులు సౌకర్యం కోసం జంక్ ఫుడ్‌ను ఆశ్రయించకుండా, సమతుల్య ఆహారాన్ని అందిస్తే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news