ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమగ్ర ఓటర్ సర్వే కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రతి ఓటరుతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకోవడం లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం వెబెక్స్ వర్చువల్ సమావేశం నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఓటర్ సర్వే, అలాగే సరళ యాప్ ద్వారా బూత్ స్థాయి ఏజెంట్ల నియామకాలపై జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని నియోజకవర్గాల వారీగా కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, జాతీయ కార్యదర్శి ఋతురాజ్ సిన్హా వెబెక్స్ సమావేశంలో పాల్గొని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి బూత్ స్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాలని, ఓటర్లతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని సూచించారు.
సమగ్ర ఓటర్ సర్వే ద్వారా ప్రతి ఓటరు వివరాలను పారదర్శకంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని జాతీయ నాయకులు స్పష్టం చేశారు. బూత్ స్థాయి కమిటీలు చురుగ్గా పనిచేస్తేనే పార్టీ బలం పెరుగుతుందని, ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నుంచి బీజేపీ నేతలు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, ఎస్ఐఆర్ రాష్ట్ర ఇంచార్జ్ నాగోతు రమేష్ నాయుడు, ఎస్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ఓటర్ సర్వే పురోగతి, బూత్ స్థాయి కార్యకలాపాలపై వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్, బూత్ స్థాయి ఏజెంట్ కోటప్రోలు కృష్ణరావు ఈ వెబెక్స్ సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ సహకారంతో నియోజకవర్గంలో జరుగుతున్న సమగ్ర ఓటర్ సర్వే వివరాలను ఆయన జాతీయ నాయకత్వానికి వివరించారు.
కైకలూరు నియోజకవర్గంలో బూత్ స్థాయిలో నియామక ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని కోటప్రోలు కృష్ణరావు తెలిపారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల వివరాల పరిశీలన, సర్వే ప్రక్రియను పద్ధతిగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి ఏజెంట్ల నియామక ప్రక్రియలో కీలక పురోగతి సాధించినట్లు సమావేశంలో వెల్లడించారు. మిగిలిన బూత్ స్థాయి కమిటీలు, బూత్ టోలి నియామకాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం సూచించింది.
ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకోవడం, ప్రజా సమస్యలను తెలుసుకోవడం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై బూత్ స్థాయి కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టాలని నాయకులు సూచించారు. ఎన్నికల విజయానికి బూత్ స్థాయి వ్యవస్థ ఎంతో కీలకమని స్పష్టం చేశారు.
కైకలూరు నియోజకవర్గంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని కోటప్రోలు కృష్ణరావు తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో, నిబద్ధతతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
సమగ్ర ఓటర్ సర్వే ద్వారా పార్టీకి ప్రజలతో మరింత అనుసంధానం ఏర్పడుతుందని, రాబోయే ఎన్నికల్లో బూత్ స్థాయి నిర్మాణం కీలక పాత్ర పోషిస్తుందని బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రతి ఓటరును చేరుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news