కొత్తవలస మండల సమైక్య కార్యాలయంలో మహిళా సాధికారతకు మరో అడుగు పడింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 7 నూతన గ్రామ సంఘాలను ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఏపీఎంఓ ఏ. వెంకటరమణ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మండల సమైక్య పరిధిలో 45 గ్రామ సంఘాలు ఉండగా, సభ్యుల సంఖ్య పెరగడంతో వాటిని విభజించి మరో 7 సంఘాలను ఏర్పాటు చేయడంతో మొత్తం సంఖ్య 52కు చేరినట్లు వెల్లడించారు.
కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సంఘాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్థంగా వినియోగించుకుని కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వెలుగు కార్యాలయ సిబ్బంది, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సీసీలు), నూతన గ్రామ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు ఐక్యంగా పనిచేస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని, సమాజంలో వారి స్థానం మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news