కౌతాళం మండల కేంద్రంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల రాకపోకలకు సౌకర్యవంతమైన, నాణ్యమైన రహదారులను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మండల అధ్యక్షులు చూడి సురేష్ నాయుడు తెలిపారు.
మండల కేంద్రంలోని వయా కౌతాళం నుంచి మురిణి రోడ్డు వరకు ఉన్న రహదారి ఎన్నో సంవత్సరాలుగా దెబ్బతిని ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం సుమారు రూ.18 లక్షల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించింది. అలాగే కౌతాళం మండల కేంద్రంలో మరో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చూడి సురేష్ నాయుడు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చూడి ఉలిగయ్యలకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గుంతలు లేని రహదారులు, మెరుగైన రవాణా వ్యవస్థ కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
మండల కేంద్రంలో సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు సుమారు కోటి రూపాయల వ్యయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. గతంలో డ్రైనేజీలు, రహదారులు లేక ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తోందని చెప్పారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించిన ఆయన, ప్రస్తుతం ప్రజల విశ్వాసంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టిబిపి చైర్మన్ టిప్పుసుల్తాన్, సింగిల్ విండో చైర్మన్ వెంకటపతిరాజు, సీనియర్ నాయకులు సౌద్రి బసవరాజు, కురువ వీరేష్, డాక్టర్ రాజనందు, ముకన్న, గిరి, అయ్యప్ప, రమేష్, కృష్ణ, గొట్టయ్య, అమ్మువలి, నభిసబ్, లింగేశ్, రేవన్న, తయన్నతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రహదారి అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత కౌతాళం మండల కేంద్రంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news