రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోవూరు మండలంలో రైతు ముంగిటకే వెళ్లి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో లేగుంటపాడు గ్రామంలోని ధాన్యం కల్లాలను సందర్శించిన మంత్రి, రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
రైతులు గోనె సంచుల కొరత, ధాన్యం రవాణా కోసం లారీలు అందుబాటులో లేకపోవడం, తేమ శాతం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి ఇకపై గోనె సంచుల కొరత ఉండదని, సరిపడా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని తరలించుకునే స్వేచ్ఛ ఉందని తెలిపారు.
22 శాతం వరకు తేమ ఉన్నా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం ఆరబెట్టడంలో ఇబ్బందులు లేకుండా మొబైల్ డ్రైయర్లు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ధాన్య సేకరణలో ఎక్కడా జాప్యం జరగకూడదని, రైతులకు ఇబ్బంది కలిగించవద్దని అధికారులను కఠినంగా ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కోవూరు ప్రాంతం వ్యవసాయాధారితమైందని, రైతుల సమస్యలను మంత్రి వెంటనే గుర్తించి స్పందించడం ఆనందకరమని తెలిపారు. రైతులకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రైతులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news