మచిలీపట్నం ఆక్వా ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆక్వా ఉద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగుల సంక్షేమం, ఐక్యత, పరస్పర సహకారం లక్ష్యంగా ఏర్పాటైన సంఘం భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు అయ్యా నాగరాజు, మత్స్య అభివృద్ధి అధికారి సలెహ, అవనిగడ్డ మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు ప్రతిభ పాల్గొన్నారు. సంఘం కార్యకలాపాలను వారు అభినందించారు. ఆక్వా రంగంలో ఉద్యోగులు అందిస్తున్న సేవలను గుర్తించి వారి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు.
మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు అయ్యా నాగరాజు మాట్లాడుతూ ప్రైవేట్ ఆక్వా ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంఘాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఆక్వా ఉద్యోగులు ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులకు సాంకేతిక సలహాలు, ఆధునిక పద్ధతులపై సూచనలు అందిస్తూ ఆక్వా రంగ అభివృద్ధికి కీలకంగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.
ఆక్వా రంగంలో ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు సంక్షేమ సంఘం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. విధి నిర్వహణలో ప్రమాదాలు లేదా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో సంఘం ఏర్పాటు చేయడం గొప్ప ప్రయత్నమని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని, మత్స్యశాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
మత్స్య అభివృద్ధి అధికారి సలెహ మాట్లాడుతూ ఆక్వా ఉద్యోగులందరూ మత్స్యశాఖ కుటుంబంలో భాగమేనని తెలిపారు. ఆక్వా రైతులకు నాణ్యమైన సాంకేతిక సేవలు అందించడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పరిశ్రమ అభివృద్ధికి ఉద్యోగులు, రైతులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఆక్వా ఉద్యోగుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఉద్యోగుల మధ్య ఐక్యత పెంపొందించడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు చిన్నం నాయుడు, అధ్యక్షులు శేషుబాబు, ఉపాధ్యక్షులు కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి దేవరకొండ వసంత్, కోశాధికారి వెంకట నాయుడు, సంయుక్త కార్యదర్శి మహేష్‌తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఆక్వా రంగం అభివృద్ధిలో ఉద్యోగుల సేవలు ఎంతో ముఖ్యమైనవని, రైతులకు మెరుగైన సాంకేతిక సహాయం అందించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఈ సంఘం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news