తెలంగాణలో భారాస రాజకీయ ప్రస్థానం ముగింపు దశకు చేరుకుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లకు పైగా గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర’ను హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి పనిచేసిందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాల వల్లే లంబాడీలు, ఎరుకల, యానాది వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా పురోగతి సాధించాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. ప్రభుత్వ పనితీరు చూసి ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీశ్‌రావు అసహనంతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బస్సుయాత్ర ముగింపు కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా లంబాడీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కొందరు లంబాడీ సంఘాల ప్రతినిధులు గాంధీభవన్ ముట్టడికి యత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news