సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామ పంచాయతీ ఎస్కేఆర్ నగర్ హరిజనవాడకు చెందిన నిరుపేద కార్మికుడు మారుతోటి పెంచలయ్యకు 'మన ఊరికోసం' స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక చేయూత అందించింది. దాతల సహకారంతో సేకరించిన రూ.14,400ను బాధితుడికి అందజేసి కుటుంబానికి అండగా నిలిచింది. పెంచలయ్య పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా, మధుమేహం కారణంగా కుడికాలికి వచ్చిన గాయం తీవ్రరూపం దాల్చడంతో వైద్యుల సూచన మేరకు కాలును తొలగించాల్సి వచ్చింది.
కాలును కోల్పోవడంతో ఉపాధి కోల్పోయిన పెంచలయ్య కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. వైద్య చికిత్స, మందులు, కుటుంబ పోషణ భారంగా మారడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. విషయం తెలుసుకున్న 'మన ఊరికోసం' సంస్థ సభ్యులు దాతల నుంచి విరాళాలు సేకరించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అవ్వారు రవిశంకర్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పెంచలయ్య పూర్తిగా కోలుకునే వరకు మరింత వైద్య, ఆర్థిక సహాయం అవసరమని పేర్కొన్నారు. సేవాభావం కలిగిన దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో కూడా అనేక మంది నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం అందించిన 'మన ఊరికోసం' సంస్థ, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పుత్తా సుధీర్, జానపాటి సుబ్బరాయుడు, దాసరి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news