కామారెడ్డి పట్టణంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ తన 131వ శాఖను ఘనంగా ప్రారంభించింది. ఈ నూతన శాఖను సంస్థ ఎండీ శైలజా కిరణ్ లాంఛనంగా ప్రారంభించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యోగులు, సిబ్బందితో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, చిట్ ఫండ్స్ వ్యవస్థ మధ్య తరగతి, పేద కుటుంబాలకు ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేయడమే కాకుండా అవసరమైన సమయంలో ఆర్థిక భరోసాను అందిస్తోందని పేర్కొన్నారు.
వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న కామారెడ్డి ప్రాంతంలో కొత్త శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందని శైలజా కిరణ్ తెలిపారు. ప్రజల పొదుపు అలవాట్లను ప్రోత్సహిస్తూ, వారి ఆర్థిక అవసరాలకు తోడ్పడే లక్ష్యంతో మార్గదర్శి సేవలు అందిస్తోందని చెప్పారు. విశ్వసనీయత, పారదర్శకత, ఖాతాదారుల నమ్మకమే సంస్థ ఎదుగుదలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి చిట్లో చేరిన ఖాతాదారుడు రాజమౌళి నుంచి డిమాండ్ డ్రాఫ్ట్ స్వీకరించి రశీదును అందజేశారు. అనంతరం సిబ్బందితో సమావేశమైన శైలజా కిరణ్, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని సూచించారు. చిట్స్ నిర్వహణలో నిబంధనల పాటింపు, సేవల నాణ్యత, వినియోగదారుల సంతృప్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వినియోగదారులు మార్గదర్శి చిట్స్ ద్వారా ఎన్నో ఏళ్లుగా పొదుపు చేస్తున్నామని, కుటుంబ అవసరాలు, వ్యాపార అవసరాలు, ఇతర ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చుకోగలుగుతున్నామని తెలిపారు. చిట్ ఫండ్స్ పద్ధతి ద్వారా క్రమబద్ధమైన పొదుపు అలవాటు ఏర్పడిందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సీఈవో సత్యనారాయణ రావు, వైస్ ప్రెసిడెంట్ బలరామకృష్ణ, అడ్మిన్ రాజాజీ, కామారెడ్డి శాఖ మేనేజర్ దామోదర్తో పాటు పలువురు ఉద్యోగులు, ఖాతాదారులు పాల్గొన్నారు. కొత్త శాఖ ప్రారంభంతో కామారెడ్డి ప్రాంత ప్రజలకు మరింత చేరువలో సేవలు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news