ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మీభూమి–బ్లాక్‌చెయిన్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. భూ రికార్డులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పారదర్శకత, భద్రత పెంచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఏడు మండలాల్లో ఈ విధానం అమలు చేయనున్నారు.
రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని సమగ్రంగా అనుసంధానం చేసి భూ రికార్డులకు ఒకే ప్రామాణిక వేదికగా మీభూమి–బ్లాక్‌చెయిన్ వ్యవస్థ పనిచేయనుంది. ప్రస్తుతం భూ వివరాలు వేర్వేరు శాఖల్లో ఉండటం వల్ల ఏర్పడుతున్న సమాచార వ్యత్యాసాలు, రికార్డుల మార్పులు, భూ వివాదాలకు ఈ కొత్త వ్యవస్థ పరిష్కారం చూపనుంది. ప్రతి భూమి వివరానికి ప్రత్యేక గుర్తింపు కల్పించి, అందులో జరిగే ప్రతి మార్పును శాశ్వతంగా నమోదు చేసే విధంగా సాంకేతిక వ్యవస్థను రూపొందించారు.
ఈ విధానంలో భూమికి సంబంధించిన కొనుగోలు, విక్రయాలు, బదలాయింపులు, సవరణలు వంటి ప్రతి లావాదేవీ సురక్షితంగా నమోదవుతుంది. రికార్డుల్లో మార్పులు చేయాలంటే ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ సేవల ద్వారానే అవకాశం ఉంటుంది. దీంతో అనధికార మార్పులు, భూ మోసాలకు అడ్డుకట్ట పడనుంది. ప్రతి లావాదేవీని ఎవరు, ఎప్పుడు నిర్వహించారనే వివరాలు కూడా శాశ్వతంగా భద్రపరచబడతాయి.
మీభూమి–బ్లాక్‌చెయిన్ వ్యవస్థను జాతీయ సమాచార కేంద్రం ఆంధ్రప్రదేశ్, బెంగళూరులోని బ్లాక్‌చెయిన్ సాంకేతిక నిపుణుల సహకారంతో అభివృద్ధి చేశారు. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ విధానం భూ పరిపాలనలో వేగం, ఖచ్చితత్వం, పారదర్శకతను పెంచనుంది. భూములకు సంబంధించిన సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆటో మ్యూటేషన్, భూ విభజన, విస్తీర్ణ సవరణ వంటి పలు పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయం, మత్స్యశాఖ, గనులు, పరిశ్రమలు, విద్యుత్ శాఖ, సీఆర్డీఏ, ఆర్థిక సంస్థలు వంటి అనేక విభాగాలు అవసరమైనప్పుడు ఈ భూ సమాచారాన్ని వినియోగించుకోగలవు.
మొదటి దశలో ఏడు జిల్లాల్లోని అస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో 89 పునఃసర్వే గ్రామాలు, 1,37,763 భూ పార్సెల్ మ్యాప్‌లు ఉంటాయి. విజయవంతమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంది.
భూ రికార్డుల భద్రత, ప్రజలకు వేగవంతమైన సేవలు, భూ వివాదాల తగ్గింపు లక్ష్యాలతో ప్రారంభిస్తున్న మీభూమి–బ్లాక్‌చెయిన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలనలో కీలక మార్పులకు దారితీయనుంది. సాంకేతికత ఆధారంగా పారదర్శక పాలనకు ఇది కొత్త అడుగుగా నిలవనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news