మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న శ్రీ రుద్ర చండీ పూర్వక కోటి కుంకుమార్చన మహాయజ్ఞంలో ప్రతిరోజూ వందలాది మంది భక్తులు, ముఖ్యంగా మహిళలు పాల్గొని అమ్మవారిని భక్తిపూర్వకంగా ఆరాధిస్తున్నారు. మంగళవారం జరిగిన ఏడో రోజు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర హాజరై శ్రీ వారాహి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. రాష్ట్రంలో శాంతి, సుభిక్షం నెలకొనాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు మంత్రికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
బ్రహ్మశ్రీ పోక్కునూరి హరినాథ శర్మ అవధాని ఆచార్యత్వంలో, బ్రహ్మశ్రీ జోష్యుల బాలకృష్ణ శర్మ, ఇటికాల చంద్రశేఖర శాస్త్రి ఆధ్వర్యంలో వేదపండితులు వివిధ హోమాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం ప్రాతఃసూక్తంతో కార్యక్రమాలు ప్రారంభమై, శ్రీ సర్పసూక్త హోమం, కుజగ్రహ హోమం వంటి విశిష్ట ఆధ్యాత్మిక క్రతువులు నిర్వహించబడ్డాయి. అనంతరం సుమారు 750 మంది మహిళలు కోటి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కొనకళ్ల జగన్నాథరావు, పలువురు పట్టణ ప్రముఖులు, భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ పాలక మండలి సభ్యులు, నిర్వాహకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు కూడా ఉత్సవాల్లో పాల్గొన్నారు. సాయంత్రం శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం సరస్వతి హోమం, బుధగ్రహ హోమం, కోటి కుంకుమార్చన నిర్వహించనుండగా, సాయంత్రం శ్రీ వారాహి మాతకు సహస్ర దీపాలంకరణ జరగనుంది. అనంతరం గుడివాడ సరస్వతీ క్షేత్రానికి చెందిన బ్రహ్మశ్రీ సరస్వతుల పవన్ కుమార్ ఆధ్వర్యంలో సుందరకాండ గానామృత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
కోటి కుంకుమార్చన మహాయజ్ఞం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో మచిలీపట్నంతో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. మహిళలు విశేషంగా పాల్గొంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని వారు కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news