నంద్యాల పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. నంద్యాల మొదటి వార్డులోని పీవీ నగర్ స్వర్గదామం సమీపంతో పాటు 21వ వార్డులో చేపట్టనున్న డ్రైనేజీ పనుల కోసం సుమారు రూ.50 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.
భూమిపూజ అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అవసరమని అన్నారు. పట్టణంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నాణ్యమైన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనులు నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
నంద్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వరుసగా మౌలిక సదుపాయాల పనులు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు, డ్రైనేజీలు, ఇతర వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, మధుసూదన్, పిచికే సుమలత, పబ్బతి వేణు, గురు ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, నంద్యాల నవ నిర్మాణ సమితి ప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news