విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు. గొర్రెల మణికంఠకు రూ.43,599, ఎండ ఈశ్వరరావుకు రూ.1,40,610, కొల్ల మల్లికార్జునరావుకు రూ.30,786, రెడ్డి సాయి సాత్విక్‌కు రూ.71,332 చొప్పున చెక్కులను అందించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్య చికిత్సలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయనిధిని పారదర్శకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నిజమైన ఆపద్బాంధవుడిగా నిలుస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం అందేలా ఎమ్మెల్యే కార్యాలయం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు.
దరఖాస్తు నుంచి చెక్కు అందే వరకు బాధిత కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తున్నామని, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని, అవసరమైన ప్రతి సందర్భంలో ప్రజలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ, 28వ డివిజన్‌కు చెందిన నలుగురు లబ్ధిదారులకు సుమారు రూ.4 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందడం కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందన్నారు. క్లిష్ట సమయంలో వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news