అనంతపురం నగరంలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు త్వరలోనే నూతన భవనాలు నిర్మించనున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నగరంలోని 50వ డివిజన్ అరుణోదయ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, చిన్నారులు మరియు గర్భిణీలకు అందిస్తున్న ఆహారం, పోషకాహార సరఫరా, కేంద్రంలోని సౌకర్యాలను పరిశీలించారు.
కిచెన్, మరుగుదొడ్లు, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొన్ని చిన్న లోపాలను గుర్తించి వాటిని వెంటనే సరిదిద్దాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీలకు మెరుగైన సేవలు అందాలని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి సేవలను కొనియాడుతూ ఆమె సమాజ సేవలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారని అన్నారు.
ఒక ముఖ్యమంత్రి కుమార్తెగా, మరో ముఖ్యమంత్రి సతీమణిగా మాత్రమే కాకుండా స్వతంత్ర వ్యక్తిత్వంతో ఎదిగిన నాయకురాలిగా నారా భువనేశ్వరిని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. హెరిటేజ్ సంస్థను విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనేక మంది పేదలకు, అవసరమైన వారికి ట్రస్ట్ ద్వారా సహాయం అందుతున్నదని చెప్పారు.
రాష్ట్రానికి భవిష్యత్ నాయకత్వాన్ని అందించిన తల్లిగా కూడా ఆమెకు ప్రత్యేక స్థానం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో పార్టీ బలోపేతానికి కూడా ఆమె చేసిన కృషి ప్రశంసనీయమన్నారు.
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ప్రస్తుతం సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, కొన్ని కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగడం వల్ల సౌకర్యాల కొరత ఎదురవుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం త్వరలోనే అవసరమైన చోట్ల కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతుందని వెల్లడించారు. చిన్నారులకు సురక్షితమైన, మెరుగైన వాతావరణంలో సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news