చిత్తూరు నగరంలోని ప్రముఖ మోర్ సూపర్ మార్కెట్లలో కాలం చెల్లిన వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపిస్తూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కొంగారెడ్డిపల్లి, ఎంఎస్ఆర్ సర్కిల్, గాంధీరోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మోర్ సూపర్ మార్కెట్లలో నిత్యావసర వస్తువులు, తినుబండారాలు, కాస్మోటిక్స్ వంటి ఉత్పత్తుల విక్రయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నెల 11వ తేదీన చిత్తూరు నగరంలోని మిట్టూరుకు చెందిన ఓ వ్యక్తి, జిల్లా కోర్టులో పనిచేస్తున్న ఓ యువ న్యాయవాది తమ కుటుంబ సభ్యులతో కలిసి కొంగారెడ్డిపల్లిలోని మోర్ సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ వారు పలు నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. బిల్లులు చెల్లించిన అనంతరం కొనుగోలు చేసిన వస్తువులపై ఉన్న తయారీ తేదీలు, కాలపరిమితిని పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయని వారు తెలిపారు.
కొన్ని వస్తువులు నెల రోజుల నుంచి ఏడాది వరకు కాలం చెల్లినవిగా ఉన్నాయని గుర్తించినట్లు బాధితులు పేర్కొన్నారు. కాలం చెల్లిన వస్తువులను కూడా ఎలాంటి హెచ్చరికలు లేకుండా సాధారణ ధరలకే విక్రయించడం వినియోగదారుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ విషయంపై మార్కెట్ నిర్వాహకులను ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని ఆరోపించారు. దీంతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
జిల్లా కేంద్రంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు సమర్థవంతంగా తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు వినియోగించే ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల నాణ్యత, తయారీ తేదీలు, గడువు తేదీలను పరిశీలించాల్సిన ఆహార భద్రత అధికారులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు వినియోగించే బిస్కెట్లు, గ్లూకోజ్ పదార్థాలు వంటి వాటిలో కూడా కాలం చెల్లిన ఉత్పత్తులు ఉంటే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు బయటపడినప్పుడు అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలు చేసి జరిమానాలతో సరిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బాధితుల ఫిర్యాదు అనంతరం మున్సిపల్ అధికారులు, ఆహార భద్రత అధికారులు మోర్ సూపర్ మార్కెట్‌ను తనిఖీ చేసి జరిమానా విధించినట్లు సమాచారం. అయితే ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కేవలం తనిఖీలు మాత్రమే కాకుండా నిరంతర పర్యవేక్షణ అవసరమని వినియోగదారులు కోరుతున్నారు.
ఆహార భద్రత, తూనికలు కొలతలు, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కాలం చెల్లిన వస్తువుల విక్రయాలను అరికట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యాపార సంస్థలు కూడా వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన వస్తువులను మాత్రమే విక్రయించాలని కోరుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news