ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు నెల్లూరులో ఆందోళన చేపట్టారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్లో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మాట్లాడుతూ మహిళా మంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత విమర్శలు, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. అంబటి రాంబాబు వెంటనే హోంమంత్రి అనితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంఎస్పీ పొలిట్ బ్యూరో సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, రాష్ట్ర నాయకులు మంద పెంచలయ్య మాదిగ, జిల్లా ఇన్చార్జి పందిటి అంబేద్కర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగలు మాట్లాడుతూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు.
నాయకులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై స్పందించి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, మహిళా ప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోంమంత్రి గౌరవాన్ని కాపాడాలని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని నాయకులు స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news