మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారు. కుటుంబ వివాదాలు, మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణలు, రెవెన్యూ అక్రమాలు, కాలుష్య సమస్యలు, సామాజిక సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు వంటి అనేక అంశాలపై ఫిర్యాదులు అందాయి.
ఈ కార్యక్రమంలో హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సవల దేవదత్, ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సత్యసాయి జిల్లాకు చెందిన ఓ మహిళ తన విడాకుల కేసుకు సంబంధించి అత్తింటి కుటుంబ సభ్యులు నకిలీ పత్రాలు సృష్టించి తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. తనకు చెందాల్సిన నగదు, బంగారం తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, పోలీసుల నుంచి కూడా సరైన సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
ప్రకాశం జిల్లాకు చెందిన మరో మహిళ మైనర్ వయసులోనే బలవంతంగా వివాహం జరిపించారని, వివాహానంతరం కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదు చేశారు. తల్లి ఇల్లు అమ్మి డబ్బు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చి మానసిక, శారీరక హింసకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రాణహాని బెదిరింపులు కూడా ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటూ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు తన భూమిలో ఉన్న వందలాది తాటి చెట్లను తొలగించి భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోయిందని పేర్కొంటూ భూమిని తిరిగి అప్పగించాలని కోరారు.
విజయవాడకు చెందిన ఓ మహిళ తన మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు మరో కుమార్తె మాదకద్రవ్యాల వ్యసనంతో ఇబ్బందులు పడుతోందని, ఆమెకు కౌన్సెలింగ్ మరియు వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అనకాపల్లి జిల్లాకు చెందిన బాధితుడు భూ రికార్డుల్లో అక్రమ మార్పులు జరిగాయని ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా ఖాతా నమోదు ప్రక్రియ చేపట్టారని, నకిలీ పత్రాల ఆధారంగా భూమి హక్కులను మార్చారని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారుల పాత్రను విచారించాలని కోరారు.
బాపట్ల జిల్లాకు చెందిన ఓ మహిళ తన కులాన్ని రికార్డుల్లో తప్పుగా నమోదు చేయడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు లభించే స్కాలర్షిప్లు నిలిచిపోయాయని, సమస్యను సరిచేసి న్యాయం చేయాలని కోరారు.
కడప జిల్లాకు చెందిన మరో మహిళ రీ-సర్వేలో జరిగిన పొరపాట్ల వల్ల భూ హక్కులకు సంబంధించిన ఫైలు పెండింగ్లో పడిందని తెలిపారు. దీంతో పశుసంవర్ధక పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నామని పేర్కొంటూ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ అనుమతులు లేకుండా విస్తరించి తీవ్ర కాలుష్యానికి కారణమవుతోందని ఆరోపించారు. భూగర్భ జలాల వినియోగం పెరగడంతో పరిసర ప్రాంతాల్లో నీటి సమస్యలు తలెత్తాయని పేర్కొంటూ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవే కాకుండా పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, ఉద్యోగ అవకాశాలు, వైద్య సహాయం, ఆర్థిక సాయం వంటి పలు అంశాలపై కూడా ప్రజలు అర్జీలు సమర్పించారు. అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖలకు పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నేతలు హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వినతులను సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతలు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news