ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చార్కోప్ ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్టాక్ పార్కింగ్ వ్యవస్థలో కారు పార్క్ చేస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో కారు, డ్రైవర్ రెండో అంతస్తు నుంచి కిందకు పడిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కందివలి చార్కోప్ ప్రాంతంలోని హారిజన్ గోల్డ్ సొసైటీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కేవలం రెండేళ్ల క్రితం నిర్మించిన ఈ అపార్ట్మెంట్లో బుధవారం రాత్రి కారు పార్కింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.
కారు పార్కింగ్ లిఫ్ట్ వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా వ్యవస్థలో లోపం ఏర్పడి కారు అదుపు తప్పింది. దీంతో వాహనం లిఫ్ట్ షాఫ్ట్‌లోకి దూసుకెళ్లి తలకిందులుగా పడిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గురైన డ్రైవర్ ఓ కార్పొరేటర్ వద్ద పనిచేస్తున్న వ్యక్తిగా తెలుస్తోంది. అయితే అతడి పూర్తి వివరాలు వెంటనే వెల్లడికాలేదు.
సొసైటీలోని రెండో అంతస్తులో పార్కింగ్ ప్లాట్‌ఫామ్ లేదన్న విషయం డ్రైవర్‌కు తెలియకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. లిఫ్ట్ షాఫ్ట్ ఖాళీగా ఉండటంతో కారు నేరుగా అందులోకి వెళ్లిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో కారు పార్కింగ్ మార్గంలో ముందుకు వెళ్లి, లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశంలోకి దూసుకెళ్లడం కనిపిస్తోంది. అనంతరం భారీ శబ్దంతో కారు లిఫ్ట్ ట్యూబ్‌లోకి పడిపోతుంది.
ఈ ఘటన ముంబైలో గతంలో జరిగిన మరో పార్కింగ్ లిఫ్ట్ ప్రమాదాన్ని గుర్తు చేసింది. మే 31న బోరివలి వెస్ట్‌లోని 21 అంతస్తుల భవనంలో కారు పార్కింగ్ లిఫ్ట్ కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
లింక్ రోడ్డులోని ప్రథమేశ్ భవన్లో జరిగిన ఆ ఘటనలో కారు సుమారు 7 మీటర్ల లోతైన గుంతలో పడిపోయింది. వరుసగా జరుగుతున్న పార్కింగ్ లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news