రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 23, 24 తేదీల్లో పోలవరం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు విద్యా రంగానికి సంబంధించిన కీలక కార్యక్రమంలో హాజరుకానున్నారు. రెండు రోజుల పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది.
జూలై 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంత్రి నారా లోకేష్ రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. సాయంత్రం 6.10 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి విమానంలో ప్రయాణించి సాయంత్రం 6.50 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పోలవరం జిల్లాకు బయలుదేరి వెళ్తారు.
రాత్రి 8 గంటలకు పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం పంచాయతీ పరిధిలోని జగరంపల్లి గ్రామ సమీపంలోని టీటీడీ ఆలయానికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి మంత్రి పర్యటన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
జూలై 24వ తేదీ ఉదయం 9.30 గంటలకు జగరంపల్లి నుంచి బయలుదేరి రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
విద్యార్థుల అభివృద్ధి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయం, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యా వ్యవస్థలో తీసుకుంటున్న చర్యలు, పాఠశాలల అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో వివరించనున్నట్లు తెలుస్తోంది.
కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రంపచోడవరం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు విమానంలో బయలుదేరి సాయంత్రం 3.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. మంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news