అమెరికాలోని న్యూయార్క్ నగరంలో లెజియోనెయర్స్ వ్యాధి (Legionnaires' Disease) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని అప్పర్ ఈస్ట్ సైడ్ ప్రాంతంలో ఇప్పటివరకు 46 కేసులు నమోదుకావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యాధి వ్యాప్తికి భవనాలపై ఏర్పాటు చేసిన వాటర్ కూలింగ్ టవర్లు ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. కలుషితమైన కూలింగ్ టవర్లలో పెరిగిన లెజియోనెల్లా (Legionella) బ్యాక్టీరియా గాలిలోని నీటి తుంపరల ద్వారా ప్రజలకు వ్యాపిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నగరవ్యాప్తంగా కూలింగ్ టవర్లను పరీక్షించి శుభ్రపరిచే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వ్యాధి వ్యాప్తిపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అప్పర్ ఈస్ట్ సైడ్‌లో నివసిస్తున్న జస్టిన్ కిర్బీ వంటి పలువురు ప్రజలు ఇళ్ల బయటకు వెళ్లేటప్పుడు ఎన్95 మాస్కులు ధరించడం ప్రారంభించారు. కొందరు తమ ఇళ్ల కిటికీలు కూడా మూసివేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ, కలుషిత కూలింగ్ టవర్లను పూర్తిగా శుభ్రం చేసే వరకు అదనపు జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాధి వ్యాప్తిపై ప్రజల్లో ఉన్న భయాందోళనల నేపథ్యంలో స్థానిక చర్చిలో నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. న్యూయార్క్ నగర ఆరోగ్య శాఖ అధికారులను ప్రశ్నిస్తూ వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తమ భద్రతకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందనే అంశాలపై వివరణ కోరారు. ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 46 మంది ఈ వ్యాధి బారిన పడగా, వారిలో 22 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్య బృందాలు బాధితులకు ప్రత్యేక చికిత్స అందిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news