హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి-44పై కొనసాగుతున్న విస్తరణ, పైవంతెనల నిర్మాణ పనులు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులు తవ్వివేయడం, సర్వీస్ రోడ్లు సక్రమంగా లేకపోవడం, ట్రాఫిక్ మళ్లింపులు సరైన విధంగా లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జడ్చర్ల-భూత్పూర్ మధ్య షేర్‌పల్లి వద్ద నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు వైపు సర్వీస్ రోడ్డుపై రాకపోకలు సాగుతుండగా, హైదరాబాద్ వైపు ప్రధాన రహదారి భాగంగా తవ్వివేయడంతో మిగిలిన భాగంలోనే వాహనాలు నడుస్తున్నాయి. ఇటీవల అక్కడ జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
రాజాపూర్ మండల కేంద్రంలో కూడా సర్వీస్ రోడ్లు లేకుండానే నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో రహదారి ఇరుకుగా మారింది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్‌లో రెండేళ్లకు పైగా పైవంతెన నిర్మాణం కొనసాగుతుండగా, ఇటీవలే రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సంత రోజు అయితే ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగి వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో బాలానగర్ నుంచి ఉండవల్లి పూసూరు వరకు సుమారు 135 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ మార్గంలో పలు చోట్ల పైవంతెనలు, అండర్‌పాస్‌లు, విస్తరణ పనులు ఒకేసారి సాగుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దివిటిపల్లి, మల్లెబోయినపల్లి, బలీదుపల్లి, వేముల స్టేజీ, జానంపేట, వెల్టూరు, కనిమెట్ట, తోమాలపల్లి ప్రాంతాల్లో పైవంతెనల నిర్మాణం కొనసాగుతోంది. అలాగే వేముల, బోరెల్లిల వద్ద అండర్‌పాస్‌లు, జల్లాపూర్‌లో హాల్టింగ్ పాయింట్, మానవపాడు పరిసరాల్లో రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ మళ్లింపులు, రహదారి అవరోధాలు కనిపిస్తున్నాయి.
స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు పలుమార్లు సర్వీస్ రోడ్లు ముందుగా ఏర్పాటు చేసి తర్వాత నిర్మాణ పనులు చేపట్టాలని కోరినా తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. రాజాపూర్ సర్పంచి కావలి రామకృష్ణ మాట్లాడుతూ, రహదారి పనుల వల్ల ప్రమాదాలు పెరిగాయని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నిర్మాణ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, తగిన భద్రతా చర్యలు, నాణ్యమైన సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులను వేగవంతం చేయడంతో పాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news