నిడదవోలు పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన గోదావరి జలాలను పైప్లైన్ ద్వారా అందించేందుకు అమృత్ 2.0 పథకం కింద భారీ తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. రూ.94.31 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. 2028 జనవరి నాటికి ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.
నిడదవోలు పట్టణ అభివృద్ధిలో కీలకమైన తాగునీటి ప్రాజెక్టు పనులను బుధవారం మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రొక్లెయిన్ ఎక్కి మట్టి తొలగించి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ధవళేశ్వరం సమీపంలోని విజ్జేశ్వరం నుంచి గ్రిడ్ లైన్ ద్వారా నిడదవోలు పట్టణానికి నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచనున్నారు. సుమారు రూ.83.82 కోట్లతో గ్రిడ్ లైన్ పనులు చేపట్టనున్నారు. అలాగే సంత ప్రాంతంలో రోజుకు 10 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నీటి శుద్ధి కర్మాగారం నిర్మించనున్నారు.
పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంత వద్ద 1000 కిలో లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్, సెయింట్ ఆంబ్రోస్ పాఠశాల సమీపంలో 700 కిలో లీటర్ల సామర్థ్యం గల ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. నిడదవోలు పట్టణవ్యాప్తంగా సుమారు 90 కిలోమీటర్ల మేర పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే 20 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు.
చిన్నకాశీరేవు వద్ద నీటి సంపు నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ లేఅవుట్ ప్రాంత ప్రజలకు ప్రత్యేక నీటి సరఫరా కోసం రూ.5.96 కోట్లతో పనులు చేపట్టామని తెలిపారు. మాలకోడు చెరువు పునరుద్ధరణకు రూ.4.53 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
మాలకోడు చెరువు అభివృద్ధిలో భాగంగా పూడికతీత, కొత్త కట్ట నిర్మాణం, రాతి కవచం ఏర్పాటు, మురుగునీటి మళ్లింపు వ్యవస్థ, బహిరంగ కాలువ నిర్మాణం, రక్షణ కంచె, వాకింగ్ ట్రాక్, చెరువు మధ్యలో ఆకర్షణీయమైన ఫౌంటెన్ వంటి పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పనులతో పట్టణ ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు.
గత ప్రభుత్వ పాలనపై మంత్రి విమర్శలు చేస్తూ గోదావరి నది పక్కనే ఉన్నప్పటికీ నిడదవోలు ప్రజలకు తాగునీటి సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. గతంలో కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ప్రాజెక్టును తిరిగి ప్రారంభించామని తెలిపారు.
నిడదవోలు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తన ప్రాతినిధ్యంలో పట్టణ అభివృద్ధి కోసం రూ.196 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.28 కోట్లు తీసుకువచ్చినట్లు తెలిపారు. నిధులు సమకూర్చడం తన బాధ్యత కాగా, పనులను వేగంగా పూర్తి చేయడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిడదవోలు మున్సిపాలిటీకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా లభించిన అవార్డుపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలకు గుర్తింపుగా వచ్చిన ఈ పురస్కారాన్ని మున్సిపల్ కమిషనర్, సిబ్బందిని అభినందిస్తూ ప్రజలకు అంకితం చేశారు.
తాగునీటి ప్రాజెక్టును పవిత్రమైన బాధ్యతగా భావించి అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. నిడదవోలు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news