ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ముంబైలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ గాయాలు ఉండటంతో వైద్యుల సూచన మేరకు తొలుత కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్సను నిపుణులైన వైద్యుల బృందం విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
వైద్యుల వివరాల ప్రకారం 2016లో తగిలిన గాయాలకు తోడు, జనసేన పార్టీ పోరాట యాత్రలు, ప్రజా కార్యక్రమాలు, గత ఎన్నికల ప్రచార సమయంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆప్యాయంగా చేతులు పట్టి లాగడం వంటి కారణాలతో రెండు భుజాల్లోని రొటేటర్ కఫ్ కండరాలకు తీవ్ర నష్టం జరిగినట్లు గుర్తించారు. దీర్ఘకాలంగా నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించినట్లు తెలుస్తోంది.
వైద్యుల సలహా మేరకు దశలవారీగా చికిత్స చేపడుతున్నట్లు సమాచారం. మొదటి దశలో కుడి భుజానికి శస్త్రచికిత్స పూర్తి కాగా, అనంతరం కోలుకున్న తర్వాత ఎడమ భుజానికి కూడా అవసరమైతే చికిత్స చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. శస్త్రచికిత్స అనంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అనంతర సంరక్షణ కొనసాగుతోందని సమాచారం. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత తిరిగి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news