ప్రతి పేదవారికి సొంతింటి కల నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పేర్కొన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో అమలవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 గృహాల నిర్మాణం పూర్తి కావడం ఎంతో సంతోషకరమని తెలిపారు.

ఈ పథకం కేవలం గృహాలను అందించడం మాత్రమే కాకుండా, పేద కుటుంబాలకు స్థిరమైన జీవన భద్రత, గౌరవప్రదమైన జీవితం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. సొంత ఇల్లు కలగడం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని, పిల్లల భవిష్యత్తు కూడా మెరుగవుతుందని వివరించారు.

ఈ నేపథ్యంలో చీరాల పట్టణంలోని 25వ వార్డులో ఏర్పాటు చేసిన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు సమాజంలో స్థిరమైన మార్పును తీసుకువస్తాయని, పేదల అభివృద్ధికి బాటలు వేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోసెఫ్, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news