భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బోటిగూడెం పంచాయతీ పరిధిలోని బంధగిరి నగరం గ్రామంలో పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రెంచ్ తవ్విన భూముల్లో మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవగా, పోడు సాగు చేస్తున్న రైతులు దీనిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోడు రైతుల కథనం ప్రకారం, గతంలో సర్వే నిర్వహించిన అటవీశాఖ అధికారులు తమను అర్హులుగా గుర్తించారని, అయితే ప్రస్తుతం కొత్తగా వచ్చిన అధికారులు మరోసారి సర్వే చేసి అర్హులు కాదని చెబుతున్నారని ఆరోపించారు. గత అధికారుల మాటలను నమ్మి సాగు కొనసాగించామని, ఇప్పుడు భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని వారు వాపోయారు.
అటవీశాఖ అధికారులు ట్రెంచ్ తవ్విన ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు యంత్రాలతో సిద్ధమవగా, తమ సాగు భూముల్లో మొక్కలు నాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పోడు రైతులు స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. పోడు భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news