ల్యాప్‌టాప్ ముందు కూర్చొని కోడింగ్ చేస్తున్నప్పుడు ఒక సమస్యను పరిష్కరించడానికి సాధారణంగా గంటలు, రోజులు, లేదా కొన్ని సందర్భాల్లో నెలలు కూడా పట్టవచ్చు. ప్రోగ్రామ్ ఎంత అడ్వాన్స్డ్ అయినప్పటికీ కొన్ని క్లిష్టమైన సమస్యలు సాధారణ కంప్యూటర్లకు పెద్ద సవాళ్లుగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో “ఇంకా వేగంగా ఆలోచించే కంప్యూటర్ ఉంటే ఎలా ఉంటుంది?” అనే ఆలోచన సహజంగా వస్తుంది. ఈ ఆలోచన నుంచే క్వాంటమ్ కంప్యూటింగ్ అనే కొత్త సాంకేతిక విభాగం ఉద్భవించింది.
సాధారణ కంప్యూటర్లు బైనరీ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తాయి. అంటే 0 లేదా 1 అనే రెండు స్థితుల్లో మాత్రమే డేటాను ప్రాసెస్ చేస్తాయి. ఇది ఒక స్విచ్ లాగా ఉంటుంది—ఆన్ లేదా ఆఫ్. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో “క్యూబిట్” అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉంటుంది. క్యూబిట్ ఒకేసారి 0 మరియు 1 రెండింటి స్థితుల్లో ఉండగలదు. దీన్ని ఒక స్పిన్నింగ్ నాణెం లాగా ఊహించవచ్చు—అది పూర్తిగా ఆగే వరకు హెడ్స్ లేదా టెయిల్స్ అని చెప్పలేం. ఈ లక్షణం క్వాంటమ్ కంప్యూటర్లకు అనేక లెక్కలను ఒకేసారి ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది.
క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుత ప్రపంచంలో అనేక రంగాలు క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు కొత్త మందులు కనుగొనడం, రసాయన ప్రతిచర్యలను అర్థం చేసుకోవడం, ఆర్థిక రంగంలో పెద్ద డేటా విశ్లేషణలు చేయడం, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడం వంటి అంశాలు సాధారణ కంప్యూటర్లతో చాలా సమయం తీసుకుంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ సమస్యలను వేగంగా పరిష్కరించడమే కాకుండా కొత్త విధానాల్లో ఆలోచించే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.
అందుకే ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ రంగంలో భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
క్వాంటమ్ కంప్యూటింగ్ కెరీర్ అవకాశాల విషయానికి వస్తే, ఇంజినీరింగ్ విద్యార్థులు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఈ బ్రాంచ్‌ల వారు ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. అలాగే ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారికి కూడా ఇది మంచి అవకాశాలను అందిస్తుంది. అయితే ముఖ్యమైన విషయం ఆసక్తి మరియు నేర్చుకునే తపన.
క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే కేవలం ఫిజిక్స్ విద్యార్థులకే పరిమితమని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఈ రంగంలో విభిన్న పాత్రలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్లు, అల్గారిథమ్ డిజైనర్లు, రిసెర్చర్లు, డొమైన్ నిపుణులు వంటి అనేక రకాల ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. అందువల్ల ఇది బహుళ శాఖల సమ్మేళనంగా ఉన్న రంగం.
విద్యార్థులు ఈ రంగాన్ని ఎలా చూడాలి అన్నది చాలా ముఖ్యం. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈరోజే నేర్చుకుని వెంటనే ఉద్యోగం పొందే టెక్నాలజీ కాదు. కానీ ఇది భవిష్యత్తులో అత్యంత ప్రభావవంతమైన రంగంగా ఎదగనుంది. అందువల్ల “నేను దీనిని ఇప్పుడే నేర్చుకోవాలా?” అనే ప్రశ్న కంటే “దీనికి నేను ఎలా సిద్ధం కావాలి?” అనే దృష్టితో ముందుకు వెళ్లాలి.
ప్రారంభించడానికి ఒక సరైన మార్గం ఉంటుంది. మొదట పైతాన్ వంటి ప్రోగ్రామింగ్ భాషను నేర్చుకోవాలి. అలాగే బేసిక్ మ్యాథమెటిక్స్ మరియు లాజికల్ థింకింగ్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలి. తదుపరి దశలో యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఇంట్రడక్టరీ వీడియోలు చూడవచ్చు. ఐబీఎం వంటి సంస్థలు అందించే క్వాంటమ్ ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌ను కూడా అన్వేషించవచ్చు.
అదనంగా Qiskit వంటి ఓపెన్ సోర్స్ టూల్స్ నేర్చుకోవడం ద్వారా క్వాంటమ్ ప్రోగ్రామింగ్‌పై అవగాహన పెంపొందించుకోవచ్చు. కోర్సెరా, ఎడ్ఎక్స్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రాథమిక కోర్సులు చేయవచ్చు. ఈ దశల తర్వాత ప్రాజెక్టులు చేయడం, ఇంటర్న్షిప్స్ పొందడం, రిసెర్చ్‌లో పాల్గొనడం ద్వారా అనుభవాన్ని పెంచుకోవచ్చు.
క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఇది కొత్త అవకాశాలను సృష్టించే రంగం. క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, క్వాంటమ్ రిసెర్చర్, క్వాంటమ్ అల్గారిథమ్ డిజైనర్, క్వాంటమ్ కన్సల్టెంట్ వంటి కొత్త రకాల ఉద్యోగాలు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందుతాయి. ఇవి ప్రస్తుతం పరిమితంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో విస్తృతంగా పెరుగుతాయి.
చివరగా, క్వాంటమ్ కంప్యూటింగ్ మన ఆలోచనా విధానాన్ని కూడా మార్చే సామర్థ్యం కలిగిన రంగం. సమస్యలను ఒకే కోణంలో కాకుండా విభిన్న కోణాల్లో చూడటం, కొత్త మార్గాల్లో పరిష్కారాలను అన్వేషించడం వంటి నైపుణ్యాలను ఇది పెంపొందిస్తుంది. టెక్నాలజీలు మారుతాయి, టూల్స్ మారుతాయి, కానీ మన ఆలోచనా విధానం అభివృద్ధి చెందడం అత్యంత ముఖ్యం.
ఈ రోజు సాధారణ కంప్యూటర్లపై పనిచేస్తున్న మనం రేపు క్వాంటమ్ సిస్టమ్స్‌తో పని చేసే అవకాశం పొందవచ్చు. ఆ భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలంటే ఇప్పటి నుంచే నేర్చుకోవడం, సాధన చేయడం, ప్రశ్నించడం, మరియు నిరంతరం కొత్త విషయాలను అన్వేషించడం అవసరం. క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, మన ఆలోచనలను విస్తరించే ఒక కొత్త దారి.
Fetching videos...
Fetching latest news...
No trending news