విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాయత్రి మరణానికి ముందు రోజు భర్త శ్రీచరణ్‌తో కలిసి రిషికేశ్, డెహ్రాడూన్ ప్రాంతాల్లో సందడి చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో ఇద్దరూ ఆనందంగా పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తూ కనిపించడం కేసుపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
సమాచారం ప్రకారం రాధా గాయత్రి, శ్రీచరణ్ కలిసి ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. రిషికేశ్, డెహ్రాడూన్ ప్రాంతాల్లోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో పాటు బంగీ జంప్, బోటింగ్ వంటి అడ్వెంచర్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డెహ్రాడూన్ క్లాక్ టవర్ సమీపంలో తీసుకున్న సెల్ఫీలు, స్కూటీపై ప్రయాణిస్తూ చిత్రీకరించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాల్లో ఇద్దరూ ఎంతో సంతోషంగా కనిపిస్తుండటంతో, మరుసటి రోజే చోటుచేసుకున్న విషాద ఘటనపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గాయత్రి మరణానికి సంబంధించిన వివరాలను భర్త శ్రీచరణ్ మీడియాకు వెల్లడించాడు. ఈ నెల 13న తాము రిషికేశ్కు వెళ్లినట్లు, అనంతరం రాత్రి ముస్సోరీలోని ఓ హోమ్‌స్టేకు చేరుకున్నట్లు తెలిపాడు. అక్కడ హోమ్‌స్టే సిబ్బంది ఇచ్చిన రెడ్ వైన్ తాగి ఇద్దరూ నిద్రపోయామని వివరించాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూడగా గాయత్రి తనపై పడుకుని ఉండటంతో పాటు ఆమె ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లు గమనించానని చెప్పాడు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు హోటల్ సిబ్బందికి కూడా తెలియజేశానని పేర్కొన్నాడు.
శ్రీచరణ్ కథనం ప్రకారం పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్లు తెలిపాడు. తాను గాయత్రిని ఎంతో ప్రేమించానని, ఆమెకు ఎలాంటి హాని చేయలేదని స్పష్టం చేశాడు. పెళ్లి ప్రారంభంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ తర్వాత ఇద్దరూ సంతోషంగా జీవించామని చెప్పాడు.
అయితే గాయత్రి తండ్రి సుధాకర్ మాత్రం తన కుమార్తె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హరిద్వార్, రిషికేశ్ ప్రాంతాలకు వెళ్తున్నట్లు మాత్రమే తమకు చెప్పారని, ముస్సోరీ ప్రయాణం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. గాయత్రి మృతిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని కోరుతూ డెహ్రాడూన్ పోలీసులకు 11 అంశాలతో కూడిన ఫిర్యాదు అందజేశారు.
గాయత్రికి మత్తు పదార్థాలు ఇచ్చి ఉండే అవకాశం ఉందని సుధాకర్ అనుమానం వ్యక్తం చేశారు. శ్రీచరణ్ ఆర్థిక లావాదేవీలు, హోటల్ సీసీటీవీ దృశ్యాలు, కాల్ రికార్డులు, ప్రయాణ వివరాలను సమగ్రంగా పరిశీలించాలని పోలీసులను కోరారు. ఈ అంశాలపై ఉన్నతాధికారులకు, ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక అత్యంత కీలకంగా మారింది. గాయత్రి మరణానికి గల అసలు కారణాలు ఆ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సహజ మరణమా, ఆరోగ్య సమస్యా లేదా ఇతర కారణాలా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఉత్తరాఖండ్ పోలీసులు, కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలు, భర్త ఇచ్చిన వివరణ, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ విశ్లేషణలు వెలువడిన తర్వాతే కేసులోని కీలక ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాధా గాయత్రి మృతి కేసు మరింత సంచలనంగా మారి ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news