కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో ఏర్పడిన విప్లవాత్మక వృద్ధి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై భారీ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి ప్రముఖ ఏఐ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అధిక ఆదాయాలు, కంపెనీ షేర్ల విలువలు పెరగడంతో నగరంలోని ఇళ్ల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏఐ రంగంలో సంపన్నులవుతున్న ఉద్యోగులు భారీ మొత్తాలు వెచ్చించి ఇళ్లను కొనుగోలు చేయడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. శాన్ఫ్రాన్సిస్కోలోని డుబోస్ ట్రయాంగిల్ అనే సంపన్న నివాస ప్రాంతంలో ఇటీవల అమ్మకానికి వచ్చిన ఓ విలాసవంతమైన ఎడ్వర్డియన్ శైలిలో నిర్మించిన మూడు బెడ్రూమ్ల అపార్ట్మెంట్ దీనికి ఉదాహరణగా నిలిచింది. దాదాపు 30 లక్షల డాలర్లకు (సుమారు 3 మిలియన్ డాలర్లు) విక్రయానికి పెట్టిన ఈ ఇంటికి భారీగా కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఇంటి అమ్మకంలో ప్రత్యేకత ఏమిటంటే, నగదు బదులుగా ఓపెన్ఏఐ లేదా ఆంత్రోపిక్ కంపెనీల షేర్లను కూడా చెల్లింపుగా స్వీకరించేందుకు యజమాని సిద్ధంగా ఉండటం.ఇది శాన్ఫ్రాన్సిస్కోలో ఏఐ కంపెనీల ప్రభావం ఎంతగా పెరిగిందో చూపిస్తోంది. సాధారణంగా ఇళ్ల కొనుగోళ్లలో నగదు లేదా బ్యాంకు రుణాలు ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు ఏఐ కంపెనీల షేర్లు కూడా విలువైన ఆస్తులుగా మారడంతో వాటిని చెల్లింపుగా స్వీకరించే పరిస్థితి ఏర్పడింది. ఏఐ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వద్ద ఉన్న కంపెనీ ఈక్విటీ ఆధారంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారు.
ఆ ఇంటిని పరిశీలించిన ఓ యువ ఓపెన్ఏఐ ఉద్యోగి మాట్లాడుతూ, ఆ ఇంటి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉందని తెలిపాడు. రెండేళ్ల క్రితం సాంకేతిక ఉద్యోగం కోసం శాన్ఫ్రాన్సిస్కోకు వచ్చిన ఆయన ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు చెప్పాడు. ఇంటి ధరను నగదు రూపంలో కాకుండా కంపెనీ షేర్ల ద్వారా చెల్లించే అవకాశంపై సంస్థలోని తన అధికారులతో చర్చించాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు.
Fetching videos...
Fetching latest news...
No trending news