సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు, వ్యూస్, లైకుల కోసం కొందరు యువత అడ్డదారులు తొక్కుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన పలువురు యువకులు అసభ్యకర, చట్టవిరుద్ధ అంశాలను ప్రోత్సహించే వీడియోలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తుండగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ యువకుడు ఫాలోవర్లను పెంచుకోవాలనే ఉద్దేశంతో అద్దెకు స్నేహితుడు, లైంగిక సేవలు వంటి అంశాలతో వీడియోలు రూపొందించి ప్రచారం చేయడంతో అతనిపై కేసు నమోదు చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఉన్నత విద్య పూర్తిచేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల కంటే సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. మొదట సరదా వీడియోలతో ప్రారంభించిన అతడు తర్వాత ఎక్కువ వ్యూస్ కోసం నగరంలోని వ్యభిచార కార్యకలాపాలు, అశ్లీల అంశాలు, రాత్రివేళల్లో జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వీడియోలు రూపొందించి ప్రచారం చేశాడు. ఈ వీడియోలు వ్యభిచారాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని గుర్తించిన పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు రూపొందిస్తున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు లేదా చదువులు పూర్తిచేసిన యువకులే ఉండటం పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. విచారణ సమయంలో వీరంతా లైక్స్, ఫాలోవర్ల కోసం మాత్రమే చేశామని, దీనివల్ల చట్టపరమైన సమస్యలు వస్తాయని తెలియదని చెబుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారాత్మక వీడియోల కంటే వివాదాస్పద, అసభ్యకర అంశాలకు ఎక్కువ స్పందన వస్తోందనే భావనతో చాలామంది ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని గుర్తించారు.
ఇలాంటి పోస్టులు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో పోలీసులు సైబర్ పెట్రోలింగ్‌ను మరింత విస్తరించారు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, అసభ్య కంటెంట్, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించే వీడియోలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. అవసరమైతే ఫిర్యాదు లేకుండానే స్వయంగా కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు నగరంలోని వివిధ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి సంబంధించిన 456 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. యువత సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, కేవలం గుర్తింపు కోసం చట్టవిరుద్ధ మార్గాలను ఎంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలు అవకాశాలు కల్పించినా, వాటి వినియోగంలో నైతిక విలువలు, చట్టపరమైన బాధ్యతలు మరువరాదని హెచ్చరిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news