శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని కోనేరు సెంటర్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ రుద్ర చండీపూర్వక కోటి కుంకుమార్చన మహాయజ్ఞం ఆరో రోజు సోమవారం వైభవంగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రాతః సూక్తంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడింది.
బ్రహ్మశ్రీ పోక్కునూరి హరినాథ శర్మ అవధాని ఆచార్యత్వంలో, బ్రహ్మశ్రీ జోష్యుల బాలకృష్ణ శర్మ, ఇటికాల చంద్రశేఖర శాస్త్రి ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తనికెళ్ల శ్రీనాథ శర్మ సర్వోపద్రష్టగా వ్యవహరించగా, పోతుకూచి ఆంజనేయ కుమార్ పర్యవేక్షణలో మహాయజ్ఞ కార్యక్రమాలు కొనసాగాయి. వేదమంత్రాలు, పూజా కార్యక్రమాలతో ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.
ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు సామా వెంకట కాంతారావు దంపతులు, కార్యదర్శి శ్రీ మోటమర్రి వెంకట బాబా ప్రసాదు ఆధ్వర్యంలో శ్రీ రుద్ర హోమం, చంద్ర గ్రహ హోమం ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం సుమారు 500 మంది మహిళలు కోటి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కుంకుమ సమర్పించారు. మహిళలు సామూహికంగా నిర్వహించిన ఈ పూజ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది.
సాయంత్రం వేళ శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ నగరేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ కళ్యాణ కార్యక్రమాన్ని భక్తులు తిలకించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అమ్మవారి, స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు మామిడి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు సామా కాంతారావు, కార్యదర్శి మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, సహాయ కార్యదర్శి హయగ్రీవ రావు, కోశాధికారి ఉడత్ శ్రీనివాసరావు, మహిళా సంఘ సభ్యులు, భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మంగళవారం నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సర్ప సూక్త హోమం, కుజగ్రహ హోమం, కోటి కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
శనివారంతో కోటి కుంకుమార్చన మహాయజ్ఞం ముగియనున్న నేపథ్యంలో పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారాహిమాతను దర్శించుకుంటున్నారు. భక్తులు ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news