వంగర మండలంలో మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో సూపర్ నారి యాప్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల మహిళా సమాఖ్య ఏపీఎం మంగమ్మ ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీసీలు, వివోఏలు, ఈనారీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “మన డబ్బులు – మన లెక్కలు” కార్యక్రమంలో భాగంగా సభ్యులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం చిన్న పొదుపు సంఘాల లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించేందుకు సూపర్ నారి యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా మహిళా సంఘాల సభ్యులు తమ లాగిన్ వివరాలతో నేరుగా ఖాతాలోకి ప్రవేశించి సంఘంలోని పొదుపులు, రుణాలు, చెల్లింపులు, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. దీంతో సంఘాల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
వంగర మండలంలోని 1,017 మహిళా సంఘాలకు చెందిన 11,339 మంది సభ్యులకు ఈ యాప్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి సభ్యురాలు స్వయంగా యాప్‌ను ఉపయోగించేలా ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వివోఏలు, ఈనారీలకు సూచించారు. ప్రతి మహిళా సంఘంలో సభ్యులందరికీ యాప్ వినియోగంపై ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చి సందేహాలను నివృత్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రత్యేక అధికారి తామరపల్లి రాము మహిళా సంఘాల డిజిటల్ సాధికారతపై మాట్లాడారు. సాంకేతికతను వినియోగించడం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతతో పాటు సభ్యుల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. యాప్‌ను సమర్థవంతంగా ఉపయోగించడం వల్ల సంఘాల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని వివరించారు.
శిక్షణ కార్యక్రమంలో సీసీలు, వివోఏలు, ఈనారీలు, మండల సమాఖ్య ఓబీసీ సభ్యులు, వంగర ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులందరూ సూపర్ నారి యాప్‌ను వినియోగించి తమ ఆర్థిక లావాదేవీలను స్వయంగా పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల డిజిటల్ అవగాహన, ఆర్థిక సాధికారత మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
Fetching videos...
Fetching latest news...
No trending news