తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌతాపూర్ గ్రామంలో సర్పంచ్ సుజన కరణ్ కోటలో రాజ్ కుమార్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే జినుగుర్తి గ్రామంలో శరణయ్యస్వామి చిన్నారులకు పోలియో చుక్కలు అందించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జినుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రషీద్ ఆధ్వర్యంలో కార్యక్రమం సజావుగా కొనసాగింది. వైద్య సిబ్బందితో పాటు మధ్యస్థాయి ఆరోగ్య సిబ్బంది శ్రీలక్ష్మీ, కల్పన, అనూష, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల వద్ద చిన్నారులను తీసుకువచ్చిన తల్లిదండ్రులకు ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు.
పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్యులు సూచించారు. ఆరోగ్య శాఖ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు అందించే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజల సహకారం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు ప్రత్యేక కృషి చేస్తున్నారని గ్రామ ప్రజలు అభినందించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news