రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని తీపర్రు గ్రామాన్ని రాష్ట్రంలోని తొలి మోడల్ పుష్కర గ్రామంగా, అక్కడి ఘాట్‌ను మోడల్ ఘాట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. తదేకం ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించిన ఆయన, శనివారం తీపర్రు గ్రామంలో నిర్వహించే "మా గోదావరి సంకల్ప్" కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి గ్రామ అభివృద్ధి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
తీపర్రు గ్రామాన్ని పర్యావరణహిత, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామాన్ని పూర్తిగా ప్లాస్టిక్ రహిత, కాలుష్య రహిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో వివిధ శాఖల సమన్వయంతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ చెరువు పునరుద్ధరణ, కాలువల శుభ్రత, నీటి ప్రవాహాల సంరక్షణ, పరిశుభ్రత కార్యక్రమాలతో పాటు గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించే చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు, పర్యాటకులు ఆకర్షితులయ్యేలా "ఐ లవ్ గోదావరి – మా తీపర్రు" పేరుతో ప్రత్యేక సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు స్థానిక పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకురావడమే లక్ష్యంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఫౌండేషన్ వివరించింది. సుమారు 25 హోమ్ స్టేలను అభివృద్ధి చేసి గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానిక కాలువలో కయాకింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలను ప్రవేశపెట్టే ప్రణాళిక రూపొందించారు. ఘాట్ పరిసరాల్లో వీధి దీపాలు, హెరిటేజ్ స్ట్రీట్ల అభివృద్ధి, ప్రత్యేక లోగో, స్లోగన్ రూపకల్పన, గ్రామ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. స్థానిక గ్రామస్థుల సహకారం, మెరుగైన రవాణా సౌకర్యాల కారణంగానే తీపర్రు ఘాట్‌ను తొలి మోడల్ ఘాట్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలను కూటమి ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తుందని తెలిపారు. పుష్కరాల నాటికి నిడదవోలు నియోజకవర్గంలోని పలు ఘాట్లను సుందరీకరించి భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తీపర్రు ఘాట్ అభివృద్ధికి ముందుకొచ్చిన తదేకం ఫౌండేషన్ సేవలను అభినందించిన ఆయన, ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో గోదావరి తీరంలోని ఘాట్లను పరిశుభ్రంగా, పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన "స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు" లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే ఆదర్శ గ్రామంగా తీపర్రును నిలబెడతామని స్పష్టం చేశారు. అలాగే ఈ నమూనాను ముక్కామల, ముక్తేశ్వరం, కుండలీశ్వరం, కొవ్వూరు తదితర గోదావరి పరివాహక ప్రాంతాలకు కూడా విస్తరించి రాష్ట్రవ్యాప్తంగా పుష్కర ఘాట్ల అభివృద్ధికి నాంది పలుకుతామని మంత్రి వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news