తెలంగాణ రక్షణ సేనకు అధికారిక రాజకీయ పార్టీగా గుర్తింపు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ నాయకత్వం కోరింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాసి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వచ్చిన వెయ్యి అభ్యంతరాల ప్రతులను తమకు అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యంతరాల వివరాలు తెలియకుండా వాటికి సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజ న్యాయ సూత్రాల ప్రకారం అభ్యంతరాల కాపీలు అందించడం అవసరమని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం తొలుత కేటాయించిన పేరుతోనే రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించామని, జెండాలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇంతకాలం అదే పేరుతో కార్యకలాపాలు సాగించిన తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చాలని సూచించడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఇప్పటికే ఒకే విధమైన లేదా దగ్గర పోలికలున్న పేర్లతో పలు రాజకీయ పార్టీలకు గుర్తింపు లభించిందని, అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేన పేరుపై మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం కావడం ఆశ్చర్యకరమని ప్రశ్నించారు.
అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించి వాటిపై సమగ్ర వివరణ ఇచ్చేందుకు తగిన గడువు కల్పించాలని, అనంతరం మాత్రమే వ్యక్తిగత విచారణకు పిలవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 29ఏ నిబంధనల ప్రకారం తమ పార్టీ దరఖాస్తును పరిశీలించి గుర్తింపు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ తరఫున సమర్పించిన అన్ని పత్రాలు, నిబంధనలను ఎన్నికల సంఘం సానుకూలంగా పరిశీలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన తమ పార్టీకి చట్టబద్ధ గుర్తింపు కల్పించాలని లేఖలో కోరినట్లు సమాచారం.
Fetching videos...
Fetching latest news...
No trending news