తెలంగాణలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రహదారి నిర్మాణ కార్యక్రమం కొత్త దశలోకి అడుగుపెట్టింది. నగర, పట్టణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చే జులై నెల నుంచి భారీ స్థాయిలో పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారుల నాణ్యతను మెరుగుపరచడం, ప్రయాణ సౌకర్యాలను పెంచడం, గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో మొత్తం 7,449.50 కిలోమీటర్ల పొడవున్న 2,162 రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.6,294.81 కోట్ల భారీ వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. ఈ నిర్మాణ పనులను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 17 ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ చేపట్టింది.
ఇప్పటికే 14 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి. ఆయా కాంట్రాక్టు సంస్థలకు పనులు చేపట్టేందుకు అనుమతులు కూడా జారీ చేశారు. మరో ప్యాకేజీ అనుమతి దశలో ఉండగా, మిగిలిన రెండు ప్యాకేజీల టెండర్ ప్రక్రియ జులై రెండో తేదీతో ముగియనుంది. ఆ వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేసారి పనులను ప్రారంభించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
హ్యామ్ విధానం ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వామ్యం కావడం. నిర్మాణ బాధ్యతలను చేపట్టే సంస్థలు నిర్ణీత కాలంలో రహదారులను పూర్తి చేయడమే కాకుండా, వాటి నిర్వహణ బాధ్యతను కూడా స్వీకరించాలి. ఈ విధానంతో రహదారుల నాణ్యత మెరుగుపడటంతో పాటు దీర్ఘకాలిక నిర్వహణ కూడా సమర్థవంతంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
టెండర్లు పొందిన సంస్థలు తమ పరిధిలోని రహదారులను 30 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం 15 సంవత్సరాల పాటు ఆ రహదారులను నిర్వహించాల్సిన బాధ్యత కూడా వారిదే. పనుల పురోగతిని బట్టి ప్రభుత్వం నిర్మాణ దశలో మొత్తం వ్యయంలో 40 శాతం నిధులను విడతల వారీగా చెల్లిస్తుంది. మిగిలిన 60 శాతం మొత్తాన్ని నిర్వహణ కాలంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లించనుంది. ఈ చెల్లింపుల్లో ధరల పెరుగుదల, వడ్డీ, ఇతర ఒప్పంద నిబంధనలకు సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి.
ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణానికి సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్‌లో ఆవిష్కరించారు. మొత్తం రూ.13,006 కోట్ల అంచనా వ్యయంతో 441 ప్రధాన రహదారులను ఉన్నతీకరించే ప్రణాళికకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలోనే రూ.1,100 కోట్లకు పైగా వ్యయంతో పలు కీలక రహదారులను ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ రహదారుల అభివృద్ధి వల్ల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం కావడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడం, విద్య, వైద్యం వంటి సేవలకు ప్రజల చేరువ మెరుగుపడటం వంటి ప్రయోజనాలు కలగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ రహదారి అభివృద్ధి కార్యక్రమం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news