డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఆన్లైన్ మోసాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య దేశవ్యాప్తంగా ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఆర్థిక మోసాల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ నేర నమోదు సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక సైబర్ నేరాల్లో దాదాపు మూడో వంతు తెలంగాణలోనే నమోదయ్యాయి.
ఒక సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా నమోదైన 73,624 ఆర్థిక సైబర్ మోసాల కేసుల్లో తెలంగాణలోనే 21,987 కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తం కేసుల్లో సుమారు 29.86 శాతం వాటా ఒక్క తెలంగాణదే. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ నేరాల సంఖ్య 1,01,118 కాగా, తెలంగాణలో 27,230 కేసులు నమోదయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ నేరాల్లో 27 శాతం వాటాకు సమానం.
రాష్ట్రంలో రోజుకు సగటున 75 సైబర్ నేరాలు నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. ఆన్లైన్ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బహుమతులు గెలిచారంటూ లింకులు పంపడం, తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో మోసాలు చేయడం, డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డబ్బులు దోచుకోవడం వంటి పద్ధతులు విస్తృతంగా కనిపిస్తున్నాయి.
సైబర్ నేరాల్లో తెలంగాణ క్రైమ్‌రేట్ కూడా దేశంలోనే అత్యధికంగా నమోదైంది. జనాభా ఆధారంగా లెక్కించినప్పుడు రాష్ట్రంలో క్రైమ్‌రేట్ 71.1గా ఉండగా, రెండో స్థానంలో ఉన్న కర్ణాటకలో అది 32.2 మాత్రమే. దేశవ్యాప్త సగటు 7.4గా ఉండటం పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టంచేస్తోంది. ఇది తెలంగాణలో సైబర్ నేరాల విస్తృతిని సూచిస్తోంది.
అయితే ఈ గణాంకాలపై పోలీస్ శాఖ భిన్నమైన వాదనను వినిపిస్తోంది. ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును కేసుగా నమోదు చేస్తున్నందునే సంఖ్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఫిర్యాదుల నమోదు విషయంలో తెలంగాణ మరింత చురుకుగా వ్యవహరిస్తోందని వారు పేర్కొంటున్నారు. అయినప్పటికీ అభియోగపత్రాల దాఖలు విషయంలో మాత్రం రాష్ట్రం వెనుకబడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో అభియోగపత్రాల నమోదు రేటు కేవలం 16.2 శాతం కాగా, దేశ సగటు 31.6 శాతంగా ఉంది.
సైబర్ నేరగాళ్లలో విదేశీ ముఠాల ప్రమేయం కూడా పెరుగుతోందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ముఠాలతో పాటు ఉత్తర భారతదేశానికి చెందిన నేరగాళ్లు కూడా తెలంగాణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లుగా ఆన్లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోతున్న బాధితుల సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదవుతోంది.
నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో కనిపించే పెట్టుబడి ప్రకటనలను నమ్మవద్దని సూచిస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి వేదికల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని చెబుతున్నారు. అలాంటి లింకుల ద్వారా ఫోన్లో హానికర అనువర్తనాలు ఇన్స్టాల్ అయ్యి వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న డిజిటల్ అరెస్ట్ మోసాల విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దర్యాప్తు సంస్థల పేర్లు చెప్పి వీడియో కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం పూర్తిగా మోసమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ భారత చట్టాల్లో లేదని చెబుతున్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఒకవేళ సైబర్ మోసగాళ్ల బారిన పడి డబ్బులు కోల్పోతే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సమయానికి ఫిర్యాదు చేస్తే నష్టాన్ని తగ్గించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన పెరగడం, అప్రమత్తతతో వ్యవహరించడం ద్వారానే సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news