పిల్లల భవిష్యత్తును విద్య ద్వారానే నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం వరుసగా రెండో ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అమలులోకి వచ్చింది. ప్రతి చిన్నారి చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా ఎలాంటి పరిమితులు లేకుండా ప్రతి అర్హ విద్యార్థికి ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది కుటుంబాలకు విద్యా ఖర్చుల భారం తగ్గి పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేందుకు ఆర్థిక భరోసా లభిస్తోంది.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పిల్లలే రాష్ట్రానికి నిజమైన సంపద అని, వారి విద్యే కుటుంబాలకు శాశ్వత ఆస్తి అని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి విద్యను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఆర్థిక కారణాలతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేలా ప్రోత్సహించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు.
ఈ ఏడాది ‘తల్లికి వందనం’ పథకం కింద 67.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది. వీరికి సంబంధించిన 42.70 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.10,120.78 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. నిధులను నేరుగా ఖాతాల్లో జమ చేయడం ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనం అందుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల కావడం వల్ల యూనిఫారాలు, పుస్తకాలు, ఫీజులు, ఇతర విద్యా అవసరాలను సులభంగా తీర్చుకునే అవకాశం కుటుంబాలకు లభిస్తోంది.
రాష్ట్రంలో విద్యను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కీలక చర్యల్లో ‘తల్లికి వందనం’ ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల నమోదు పెరగడంతో పాటు బడి మానివేతలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి తల్లి తన పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటుందని, అలాంటి ప్రతి తల్లికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం” అంటూ ఆయన తల్లుల సేవను అభినందించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news