అమెరికాలో జన్మహక్కు పౌరసత్వం (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) అంశంపై మరోసారి రాజకీయ, న్యాయపరమైన చర్చలు వేడెక్కుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జన్మహక్కు పౌరసత్వాన్ని సమర్థిస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పును పునర్విచారించాలని అమెరికా సుప్రీంకోర్టును తక్షణమే కోరనున్నట్లు ప్రకటించారు. ఈ తీర్పు అమెరికా భవిష్యత్తుకు హానికరమని ఆయన ఆరోపిస్తూ, దీనిని "న్యాయ వైఫల్యం"గా అభివర్ణించారు. కొద్ది రోజుల క్రితం అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అమెరికా భూభాగంలో జన్మించిన పిల్లలకు, వారి తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా దేశంలో ఉన్నప్పటికీ, రాజ్యాంగం ప్రకారం జన్మతః అమెరికా పౌరసత్వం లభిస్తుందని స్పష్టం చేసింది. దీంతో ట్రంప్ ప్రభుత్వం జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేయాలనే లక్ష్యంతో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఈ తీర్పు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (14th Amendment) ఆధారంగా వెలువడింది. ఈ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం లభిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరులేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ తీర్పు ట్రంప్ వలస విధానాలకు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది. అక్రమ వలసలను నియంత్రించేందుకు జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్ లక్ష్యానికి ఈ తీర్పు అడ్డుకట్ట వేసింది. మరోవైపు పౌర హక్కుల సంస్థలు మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించాయి. అమెరికా రాజ్యాంగ విలువలను, సమాన హక్కులను కాపాడే చారిత్రక తీర్పుగా అభివర్ణించాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news