అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కొత్త వీసా నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. బీ-1 వ్యాపార వీసాలు, బీ-2 పర్యాటక వీసాల కోసం అమెరికా ప్రభుత్వం వీసా బాండ్ కార్యక్రమాన్ని విస్తరించింది. ఈ కొత్త విధానం ప్రకారం నిర్దేశిత 50 దేశాల నుంచి అమెరికాకు వచ్చే కొంతమంది సందర్శకులు భారీ మొత్తంలో బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.
అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉండిపోయే వారి సంఖ్యను తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తొలుత ప్రయోగాత్మక కార్యక్రమంగా ప్రారంభించిన వీసా బాండ్ విధానంలో మార్పులు చేసి ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించారు.
కొత్త నిబంధనలు 2026 ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం, వ్యాపారం లేదా పర్యాటక అవసరాల కోసం తాత్కాలికంగా అమెరికాకు వచ్చే సందర్శకులు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ మొత్తం కనిష్ఠంగా 5 వేల డాలర్ల నుంచి గరిష్ఠంగా 20 వేల డాలర్ల వరకు ఉండే అవకాశం ఉంది.
గతంలో పైలట్ కార్యక్రమంలో భాగంగా 5 వేల డాలర్లు, 10 వేల డాలర్లు, గరిష్ఠంగా 15 వేల డాలర్ల వరకు బాండ్ మొత్తాలను నిర్ణయించారు. అయితే తుది నిబంధనల్లో 5 వేల డాలర్ల ఎంపికను తొలగించి, గరిష్ఠ బాండ్ మొత్తాన్ని 20 వేల డాలర్లకు పెంచారు.
వీసా ఓవర్‌స్టే రేటు ఎక్కువగా ఉన్న 50 దేశాల పౌరులకు మాత్రమే ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ప్రాంతాలకు చెందిన కొన్ని దేశాలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ జాబితాలో భారత్ పేరు లేకపోవడం భారతీయ ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఈ వీసా బాండ్ విధానం కిందకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా వాణిజ్య విమానాల ద్వారానే అమెరికాకు ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రయాణికుడు వీసా నిబంధనలను పాటించి, నిర్ణీత సమయంలో అమెరికా నుంచి తిరిగి వెళ్లినట్లయితే బాండ్ మొత్తం తిరిగి చెల్లిస్తారు.
అయితే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే కొనసాగితే, ప్రభుత్వం ఆ బాండ్ మొత్తాన్ని నిలిపివేసే అవకాశం ఉంటుంది. దీంతో వీసా నిబంధనలను ఉల్లంఘించే వారిపై నియంత్రణ పెంచాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
అమెరికాలోకి వచ్చే విదేశీ ప్రయాణికుల పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. వలస నియంత్రణ, భద్రతా చర్యల్లో భాగంగా అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాల్లో ఇది కూడా ఒకటిగా భావిస్తున్నారు.
కొత్త వీసా బాండ్ విధానం అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాకు వ్యాపార, పర్యాటక అవసరాల కోసం వెళ్లే వారు ముందుగానే అదనపు ఆర్థిక ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అయితే నిబంధనలు పాటించే ప్రయాణికులకు బాండ్ మొత్తం తిరిగి అందే అవకాశం ఉండటంతో ఇది పూర్తిస్థాయి రుసుముగా పరిగణించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news