రైతులు ఉద్యాన పంటల సాగుపై ఆసక్తి చూపించి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వంగర ఎంపీడీవో తులా రాజారావు సూచించారు. వంగర మండల కేంద్రంలో క్షేత్ర సహాయకులు, సాంకేతిక సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఆదాయం పెంచే విధంగా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నీటి సంరక్షణకు సంబంధించిన పనులు చేపట్టాలని ఎంపీడీవో సూచించారు. ప్రతి పంచాయతీలో 8 ఫారం పాండ్లు, ఒక పిస్ పాండును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడుతుందని వివరించారు.
వికసిత్ భారత్ గ్యారెంటీ పర్ రోజ్గార్ అజీవిక మిషన్లో భాగంగా 2026–27 సంవత్సరంలో రైతులకు హార్టికల్చర్ మొక్కలను అందించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ భూముల గట్లు, మెట్టు ప్రాంతాల్లో కొబ్బరి, వెదురు మొక్కలు నాటుకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
పండ్ల తోటల అభివృద్ధిలో భాగంగా మామిడి, జీడి, సపోటా, కొబ్బరి, జామ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, మునగ, నిమ్మ, పనస వంటి వివిధ రకాల మొక్కలను సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. వంగర మండలంలో సుమారు 50 ఎకరాల్లో తోటల పెంపకానికి అవకాశం ఉందని తెలిపారు. అర్హత కలిగిన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
చిన్న, సన్నకారు రైతులు, ఒక బీ కలిగిన రైతులు, జాబ్ కార్డు ఉన్న రైతులకు హార్టికల్చర్ పథకం ద్వారా ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీవో సూచించారు. గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు రైతులకు ఈ పథకం గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి రైతు ప్రభుత్వ అవకాశాలను ఉపయోగించుకుని వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో ఏపీవో సంకాబత్తుల హరినాథ్, ఈసీ వెంకటరమణ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవసరమైన సమాచారం అందించి పథకాల అమలును సమర్థవంతంగా కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news