బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం గ్రామంలో ఉన్న శ్రీ మంతెన సుబ్బరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి వారి ప్రతిభను అభినందించిన ఆయన, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. విద్యార్థుల చదువులు, పాఠశాల సౌకర్యాలు, బోధన నాణ్యతపై వారితో ఆత్మీయంగా మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి విద్యాభివృద్ధికి భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మెగా పీటీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు పాఠశాలల అభివృద్ధికి వారి సూచనలు స్వీకరించడమే మెగా పీటీఎం ప్రధాన ఉద్దేశమని వివరించారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి తల్లి ఖాతాలో ప్రభుత్వం నేరుగా నిధులు జమ చేసిందని తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో 17,563 మంది తల్లుల ఖాతాల్లో రూ.22.83 కోట్లకు పైగా జమ చేయడం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయడానికి మోడల్ పాఠశాలలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విద్యార్థులకు అందించే కిట్లపై రాజకీయ నాయకుల చిత్రాలకు బదులుగా విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
పిల్లల విద్యాభివృద్ధి కేవలం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా అంతే కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పిల్లల హాజరు, చదువుపై నిరంతర పర్యవేక్షణతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వం విద్య, పోషకాహారం, మౌలిక వసతులు, ఉపాధ్యాయ నియామకాలు వంటి అన్ని రంగాల్లో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తోందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌ను విజయవంతం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news