విహార యాత్ర కోసం వియత్నాం వెళ్లి పడవ ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ వేగవంతమైంది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని భారత్‌కు పంపిస్తున్నట్లు అక్కడి భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి బాధితులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శనివారం జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మొత్తం 15 మంది మృతి చెందగా, సహాయక బలగాలు రక్షించిన వారిలో 16 మందిని ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి చేశారు. మరో వ్యక్తికి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు వియత్నాం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ముందుగా హో ఛి మిన్ నగరానికి తరలిస్తున్నారు. అక్కడ అవసరమైన అధికారిక లాంఛనాలు పూర్తయిన అనంతరం మృతదేహాలను స్వదేశానికి పంపనున్నట్లు భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. వియత్నాం అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, కేరళకు చెందిన ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఏపీకి చెందిన మృతుల్లో రవితేజ, శ్రీధర్, జయలక్ష్మి ఉన్నారు. వీరి భౌతికకాయాలను త్వరితగతిన స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
మృతదేహాలను జులై 13 నాటికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అక్కడి నుంచి బాధితుల కుటుంబాలకు అప్పగించి స్వస్థలాలకు తరలించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వియత్నాం ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయ అధికారులు అవసరమైన అనుమతుల ప్రక్రియను పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మచిలీపట్నానికి చెందిన గెల్లి కిషోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో అధునాతన ప్రాణాధార చికిత్సపై ఉన్నారు. వైద్య పరీక్షల్లో మెదడులో చిన్న రక్తపు గడ్డ ఉన్నట్లు గుర్తించారు. స్వల్పంగా గుండె సమస్య తలెత్తడంతో అత్యవసర చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఫూ క్వాక్ నుంచి హో ఛి మిన్ సిటీకి తరలించాలని నిర్ణయించారు.
కిషోర్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను మెరుగైన వైద్యం కోసం భారత్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు విజయవాడకు చెందిన జయలక్ష్మి భౌతికకాయం సోమవారం సాయంత్రానికి చేరుకునే అవకాశం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఫూ క్వాక్ ద్వీపంలో చిక్కుకుపోయిన తెలుగు పర్యాటకులంతా హనోయి విమానాశ్రయానికి చేరుకున్నారు. వారు వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానంలో ఆదివారం రాత్రి హనోయి నుంచి బయల్దేరారు. బాధిత కుటుంబాలకు అత్యవసరంగా ఈ-వీసాలు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం వియత్నాంలోని భారత రాయబార కార్యాలయాన్ని కోరింది. మొత్తం ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు కొనసాగిస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news