విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్స్ సేవల పేరుతో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న అధికారులు న్యూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డీసీఎంఆర్వో మంగాదేవిపై బదిలీ వేటు వేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందాల్సిన ఉచిత అంబులెన్స్ సేవల విషయంలో ఎలాంటి అక్రమాలు, నిర్లక్ష్యం సహించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా న్యూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో అంబులెన్స్ సేవలు, రోగులకు అందుతున్న సదుపాయాలు, సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంబులెన్స్ సేవల్లో ఎలాంటి అక్రమాలు జరుగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్స్ సేవలు పూర్తిగా ఉచితమని స్పష్టం చేశారు. రోగుల నుంచి డబ్బు డిమాండ్ చేయడం లేదా లంచం కోరడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఎవరైనా అంబులెన్స్ సేవల కోసం డబ్బు అడిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news