విశాఖ నగరాన్ని కాలుష్య రహిత, పర్యావరణ అనుకూల నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టిందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి అనుగుణంగా విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి ఐటీ సేవలు, పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం విశాఖ పోర్టు అథారిటీ ద్వారా నిర్వహిస్తున్న బొగ్గు, ఖనిజాలు వంటి దుమ్ము వ్యాప్తికి కారణమయ్యే బల్క్ కార్గో హ్యాండ్లింగ్‌ను సమీపంలోని మూలాపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు దశలవారీగా మళ్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై మంత్రుల కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి తగిన నిర్ణయాలు తీసుకోనుందని తెలిపారు.
బల్క్ కార్గో కార్యకలాపాలను మూలాపేట పోర్టుకు తరలించడం ద్వారా విశాఖ పోర్టుపై ఉన్న కార్గో ఒత్తిడి తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. దీంతో ఓడల రాకపోకల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారడంతో పాటు, షిప్పింగ్ సంస్థలపై పడుతున్న అదనపు ఖర్చులు తగ్గే అవకాశం ఉందన్నారు.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే విశాఖ నగరంలో వాయు కాలుష్యం తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాలుష్య కారకమైన కార్యకలాపాలను నగర పరిధి నుంచి తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.
మూలాపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తొలి దశ నుంచే వాణిజ్యపరంగా విజయవంతంగా పనిచేసేందుకు ఈ కార్గో బదిలీ నిర్ణయం ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. విశాఖ పోర్టు, మూలాపేట పోర్టుల మధ్య సమన్వయం పెరగడం ద్వారా రాష్ట్రంలో సముద్ర వాణిజ్యం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనలో భాగంగా విశాఖ పోర్టు అథారిటీ మూలాపేట పోర్టు ప్రత్యేక ప్రయోజన వాహనం (ఎస్పీవీ)లో 49 నుంచి 50 శాతం వరకు ఈక్విటీ భాగస్వామ్యం కల్పించాలని ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. అలాగే నామినేషన్ లేదా ప్రాధాన్యత హక్కు విధానంలో తొలి దశలో రెండు బెర్తులు, రెండో దశలో మరో రెండు బెర్తులు కేటాయించాలని కోరినట్లు వివరించారు.
ఎస్పీవీకి బదిలీ చేసే ఉప్పు భూములకు న్యాయమైన విలువను నిర్ణయించాలని కూడా విశాఖ పోర్టు అథారిటీ ప్రతిపాదించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి భాగస్వామ్య విధివిధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు.
రామాయపట్నం పోర్టుకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ ప్రతిపాదనలను కూడా పరిశీలించనుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మంత్రుల కమిటీలో పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ సభ్యులుగా ఉన్నారని చెప్పారు.
మంత్రుల బృందానికి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శులు అవసరమైన సాంకేతిక, పరిపాలనా సహకారం అందిస్తారని మంత్రి తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం పరస్పర ఆమోదయోగ్యమైన సిఫార్సులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news