ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో కొందరు యూజర్లు అనూహ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. పలువురు వినియోగదారుల అకౌంట్లను వాట్సాప్ అండర్ రివ్యూలో ఉంచినట్లు సమాచారం. ఈ కారణంగా కొంతమంది యూజర్లకు మెసేజింగ్, కాలింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
యూజర్ల వివరాల ప్రకారం, నిన్న రాత్రి 8 గంటల నుంచి కొన్ని వాట్సాప్ ఖాతాల్లో ఈ సమస్య కనిపించినట్లు తెలుస్తోంది. అకౌంట్ వినియోగించేందుకు ప్రయత్నించినప్పుడు సమీక్షలో ఉన్నట్లు సందేశాలు వచ్చినట్లు పలువురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొందరి ఖాతాలకు 24 గంటల పాటు తాత్కాలికంగా పరిమితులు విధించినట్లు వాట్సాప్ నుంచి సమాచారం వచ్చినట్లు యూజర్లు చెబుతున్నారు.
సాధారణంగా వాట్సాప్ తన నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానం వచ్చినప్పుడు కొన్ని ఖాతాలను పరిశీలనలోకి తీసుకుంటుంది. స్పామ్ సందేశాలు పంపడం, అనుమానాస్పద కార్యకలాపాలు, భద్రతా నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలను గుర్తించేందుకు ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా ఖాతాలను పరిశీలించే అవకాశం ఉంటుంది.
అయితే ఈసారి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే కొందరి ఖాతాలు అండర్ రివ్యూలోకి వెళ్లినట్లు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. సాధారణంగా ఉపయోగించే ఖాతాలు కూడా ప్రభావితమయ్యాయని పలువురు పేర్కొంటున్నారు. దీంతో వాట్సాప్ వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అకౌంట్ బ్లాక్ అయిన సమయంలో కొత్త సందేశాలు పంపడం, కాల్స్ చేయడం వంటి సేవలు అందుబాటులో ఉండకపోవచ్చని యూజర్లు తెలిపారు. అయితే ఈ సమస్య శాశ్వత నిషేధం కాదని, పరిశీలన పూర్తయిన తర్వాత ఖాతాలకు తిరిగి యాక్సెస్ అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభావిత ఖాతాలకు తిరిగి యాక్సెస్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వాట్సాప్ ప్రతినిధులు వెల్లడించినట్లు సమాచారం. సాంకేతిక కారణాలు లేదా భద్రతా తనిఖీలలో భాగంగా కొన్ని ఖాతాలు తాత్కాలికంగా పరిమితం అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
వాట్సాప్ వినియోగదారులు తమ ఖాతా భద్రత కోసం యాప్ అధికారిక నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, అనధికారిక వాట్సాప్ వెర్షన్ల వినియోగాన్ని నివారించాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సమస్య ఎంతమంది యూజర్లను ప్రభావితం చేసిందనే దానిపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. అయితే సోషల్ మీడియాలో పలువురు తమ అనుభవాలను పంచుకుంటుండటంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రభావిత యూజర్లకు త్వరలోనే సేవలు పునరుద్ధరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news