ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వివిధ రంగాలకు రుణాల విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో నిర్వహించిన 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకులను కోరారు. ప్రజలు డబ్బులు కోల్పోకుండా తక్షణ స్పందన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు.
కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని వివిధ రంగాలకు మొత్తం రూ.8.10 లక్షల కోట్ల రుణాలను అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఇందులో వ్యవసాయం సహా ప్రాధాన్యతా రంగాలకు రూ.5.40 లక్షల కోట్లు, ఇతర రంగాలకు రూ.2.70 లక్షల కోట్ల రుణాలు కేటాయించారు. వ్యవసాయ రంగానికి రూ.3.60 లక్షల కోట్లు, పంట రుణాల కోసం రూ.2 లక్షల కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రత్యేక ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలిపారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రంగానికి భారీ స్థాయిలో రుణాలు మంజూరు చేసి ఉపాధి అవకాశాలను పెంచాలని బ్యాంకులను కోరారు. కొత్త వ్యాపారాలు, ఆవిష్కరణలు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు రుణాల మంజూరులో చొరవ చూపాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
విద్యా రుణాల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకునే విద్యార్థులకు వడ్డీపై అదనంగా నాలుగు శాతం రాయితీ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశీయ, విదేశీ విద్యా అవకాశాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. అలాగే పునరుత్పాదక ఇంధనం, సౌర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి రంగాలకు కూడా బ్యాంకులు మరింత సహకారం అందించాలని కోరారు.
డిజిటల్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రామాణిక విధానాలు రూపొందించాలని బ్యాంకులకు సూచించారు. కేంద్ర స్థాయి లావాదేవీ పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి డిజిటల్ మోసాల నుంచి రక్షణ కల్పించాలని సూచించారు.
అమరావతి రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలను విస్తరించే దిశగా బ్యాంకులు తమ నిర్మాణాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఆర్థిక జిల్లాలో ఆధునిక, ప్రతిష్ఠాత్మక బ్యాంకు భవనాలను నిర్మించి అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, యువత, రైతులు, వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారతకు బ్యాంకింగ్ రంగం కీలకంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధిక వృద్ధిరేటు సాధనకు అవసరమైన ఆర్థిక మద్దతును అందించడంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news